కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచానికి ఇంకా పూర్తి స్పష్టత అయితే రాలేదు. భౌతిక దూరం, మాస్క్ లు, పరిశుభ్రత.. ఇవి కరోనా సోకుండా చూడగలవనే స్పష్టత మాత్రం ఉంది. అయితే ఇప్పటికే చాలా మందికి కరోనా సోకి వెళ్లిపోయింది, వారిలో యాంటీ బాడీస్ కూడా ఏర్పడ్డాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరిలో కరోనాను ఎదుర్కొనగల ఇమ్యూనిటీ సహజంగానే ఉందని ఇండియాలోనే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో జరిగిన ఒక పరిశోధన మరో విషయాన్ని చెబుతూ ఉంది.
దాదాపు 7,807 మంది పై జరిగిన ఈ పరిశోధన ప్రకారం.. విటమిన్ డీ లెవల్ బాగా ఉన్న వారిపై కరోనా ప్రభావం తక్కువట! ఈ 7,807లో దాదాపు పది శాతం మంది కరోనా సోకిన వారట. కరోనా సోకిన 782 మందితో పాటు వీరందరికి ఆరోగ్య పరీక్షలు చేయగా.. కరోనా సోకిన వారిలో విటమిన్ డీ లెవల్స్ తక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. డీ విటమిన్ లెవల్స్ బాగా ఉన్న వారిలో కరోనా జాడ కనిపించలేదట. ఈ నేపథ్యంలో విటమిన్ డీ తక్కువగా ఉన్న వారికి కరోనా భయం కొంచెం ఎక్కువ అనేది ఈ పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే కరోనా సోకిన వారిలో కూడా ప్లాస్మాలో విటమిన్ డీ లోటు తీవ్రత ఎక్కువైన వారు ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తాము కనుగొన్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు.
స్థూలంగా ఈ పరిశోధన చెబుతున్న మాటేమిటంటే.. విటమిన్ డీ ని వృద్ధి చేసుకోమని. ఉదయం పూట సూర్యకాంతికి ఎక్స్ పోజ్ కావడం వల్ల శరీరంలో విటమిన్ డీ వృద్ధి అవుతుందని వైద్యులు కూడా చెబుతుంటారు. దాంతో పాటు గుడ్లు, పుట్టగొడుగులు, చేపలు, నారింజ రసం.. వంటి వాటివి తీసుకుని, ఉదయం పూట కనీసం 20 నిమిషాలు సూర్యకాంతిలో గడపడం ద్వారా విటమిన్ డీని వృద్ధి చేసుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.