టీడీపీని మొదటి నుంచి దీటుగా ఎదుర్కొంటున్న బీజేపీ నేతగా సోము వీర్రాజుకు అగ్రస్థానం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీతో టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకుంది. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు తీవ్రస్థా యిలో విమర్శలు చేసుకున్నారు. ఆ సందర్భంలో టీడీపీపై ఓ రేంజ్‌లో సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.
టీడీపీ అంటే వీర్రాజు ఒంటి కాలిపై లేస్తారనే పేరు తెచ్చుకున్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజుపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక దశలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి తమ భిక్ష అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సందర్భంలో అసలు టీడీపీకి అధికారం తమ భిక్ష అని బీజేపీ నేతలు ఘాటుగా బదులిచ్చారు.
2019లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న టీడీపీ తిరిగి ఎలాగైనా బీజేపీకి దగ్గర కావాలని శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం టీడీపీ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన మొదటి రోజు నుంచి టీడీపీపై సోము తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించి…తన వైఖరి ఏంటో సంకేతాలు పంపారు.
టీడీపీ పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలని ప్రధాని మోడీని కోరుతానని సోము వీర్రాజు ప్రకటించి బాంబు పేల్చారు. అంతేకాదు, అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీని కూడా తమ ప్రత్యర్థిగా భావిస్తామని సోము వీర్రాజు పదేపదే చెబుతుండడం చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడలేదు. అంతేకాదు. 2024లో బీజేపీ-జనసేన మిత్రపక్షాల కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం ద్వారా టీడీపీ పని అయిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు, ఎల్లో మీడియాకు ఒక వైపు పట్టరాని కోపం, మరోవైను తీవ్ర ఆవేదన మిగుల్చుతోంది.
2024లో ఒంటరిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారానికి దగ్గర కాలేనని టీడీపీ అధినేత చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలి తాలు ఓ హెచ్చరిక చేయడంతో గుణపాఠం పంపాయి. అందుకే పార్టీని బతికించుకోవాలంటే ఎలాగైనా 2024లో అధికారంలోకి రావడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్.
ఒకవేళ 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే మాత్రం…ఏపీలో టీడీపీ అనేది చరిత్ర కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు వయసు పైబడుతున్న నేపథ్యంలో…ఇక ఆయన రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి ఉండదు. మరోవైపు బాబు రాజకీయ వారసుడు లోకేశ్‌కు జాకీలు వేసి నిలబెడుతున్నా…ఎదగలేని దుస్థితి.
అసలు చంద్రబాబుపై సోము వీర్రాజుకు ఎందుకంత కోపం అనేది ఇంతకాలం ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్న. చంద్రబాబు అనుకూల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ మొత్తాన్ని జాగ్రత్తగా చదివితే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
‘2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అయితే, నామీద ఇష్టంలేక కాబోలు, నేను ఓడిపోతానని, 5 వేల ఓట్లు కూడా రావని చంద్రబాబు ముందే ప్రచారం చేశారు. కానీ, నాకు 42 వేల ఓట్లు వచ్చాయి’…ఇదీ సోము వీర్రాజు మనసును రగుల్చుతున్న ప్రధాన అంశం. సోము వీర్రాజును వంచించిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయి ఉండొచ్చు. కానీ బాబు మోసానికి దెబ్బతిన్న వీర్రాజు హృదయం ఎప్పటికీ ఆరని మంటలా రగులుతూనే ఉంది.
తననే కాదు, బీజేపీని కూడా బాబు అడుగడుగునా మోసం చేయడంతో…ఇక టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో కోలుకోలేని దెబ్బతీయాలని సోము వీర్రాజు గట్టి పట్టుదలతో ఉన్నారు. బయటికి తెలియని చాలా అంశాలు బాబుపై ఆగ్రహానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు. బాబు వంచనా స్వభావం నేడు ఆయన రాజకీయ పతనానికి బీజం వేసిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.