ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం టీడీపీకి, ఎల్లో మీడియాకు అసలు నచ్చడం లేదు. వీర్రాజుకి అభినందనలు తెలిపిన వారిలో టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన వారు ఎక్కడా కనిపించలేదు. అంతెందుకు అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన కన్నా లక్ష్మినారాయణ సైతం కనీస మర్యాద కోసమైనా సోము వీర్రాజుకు అభినందనలు చెప్పినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. మరి నేరుగా ఏమైనా వీర్రాజుకు ఫోన్ చేసి అభినందనలు చెప్పారేమో తెలియదు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైన వెంటనే…ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించేలా చేయాలని ఎల్లో మీడియా నిన్నంతా విశ్వ ప్రయత్నం చేసింది. అబ్బే…వీర్రాజు ముందు ఎల్లో మీడియా పప్పులేవీ ఉడకలేదు. తమ చానళ్ల డిబేట్లలో చంద్రబాబు గురించి అడిగినా, అడగకపోయినా సోము మాత్రం ఉతికి ఆరేశారనే చెప్పాలి. చివరికి ఓ చానల్ ప్రతినిధి ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఏముందని అసహనంగా ప్రశ్నించాడంటే…ఎంత వేదన చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
2024లో బీజేపీ-జనసేన అభ్యర్థే సీఎం అవుతారని సోము వీర్రాజు ధీమాగా చెబుతుండడం టీడీపీకి వెన్నులో చలి పుట్టిస్తోంది. ఎందుకంటే జనసేన, బీజేపీ సారథులిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. అందులోనూ ఆ రెండు పార్టీలు చీల్చే ఓట్లలో మెజార్టీ షేర్ టీడీపీదే. వైసీపీకి బలం ఉన్న సామాజిక వర్గాల్లో ఎటూ బీజేపీకి వ్యతిరేకతే ఎక్కువ. అందుకే టీడీపీ భయపడుతోంది.
బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత మొదటి రోజే సోము వీర్రాజు తన రాజకీయ పంథా ఏంటో స్పష్టంగా ప్రకటించి టీడీపీకి హెచ్చరిక పంపారు. నిన్న ఆయన మాటల్లోని కీలక వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిద్దాం.
*మాజీ సీఎం చంద్రబాబు ఒక రాజధాని అమరావతినే నిర్మించలేనప్పుడు… ప్రస్తుత సీఎం జగన్ మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు?
*చంద్రబాబు మా పార్టీని ఎదగనీయలేదు. 1996లో టీడీపీకి 16 ఎంపీ స్థానాలు వచ్చాయి. కానీ, ఆయన వాజ్‌పేయి ప్రభుత్వా నికి మద్దతు ఇవ్వలేదు. ‘నేషనల్ ఫ్రంట్’ పేరుతో రాజకీయం చేశారు.
* 2014లో మోదీ ప్రభావం వల్ల చంద్రబాబు బీజేపీకి మళ్లీ దగ్గరయ్యారు. 14 సీట్లు ఇచ్చారు. కొన్నిచోట్ల రెబల్స్‌ను పెట్టారు. తనకు కావలసిన వాళ్లు కొందరిని బీజేపీలోకి పంపి సీట్లు ఇచ్చారు. 2019 నాటికి బీజేపీని జీరో చేశారు.
*టీడీపీతో పొత్తు అనేది మోదీ, అమిత్‌షాల నిర్ణయంపై ఉంటుంది. నేను మాట్లాడను.
*జగన్, చంద్రబాబు ఇద్దరి పాలనా ఒకటే. అవినీతి అంతే. కక్షసాధింపులు అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. టీడీపీలోకి వైసీపీ నేతలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వలేదా?
*ఎమ్మెల్సీగా సీఎంను కలిస్తే తప్పా? నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కలుస్తుంటాను. మిత్రులుగా ఉండి విడిపోయిన తర్వాత కూడా అప్పటి సీఎం చంద్రబాబును ఆరుసార్లు కలిశాను. జగన్‌ను కూడా ఒక వ్యక్తికి ఆపరేషన్ కోసం రూ.22 లక్షలు అవసరమని అడిగా.. రూ.16 లక్షలు ఇచ్చారు.