మూడు నెలలుగా ఒకే తీవ్రతతో ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దేశంలో మొదటి నుంచి అత్యధిక కరోనా కేసులతో నిలుస్తూ ఉంది మహారాష్ట్ర. ఏప్రిల్ నెల నుంచి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య ఎప్పుడో మూడు లక్షలను దాటిపోయింది. మొత్తం మూడు లక్షలా ఎనభై వేల వరకూ అక్కడ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,896 వరకూ ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
మహారాష్ట్ర రాజధానిలో కోవిడ్ -19 తీవ్రత మొదటి నుంచి తీవ్రంగానే ఉంది. అక్కడ పెద్ద పెద్ద స్టార్లు కూడా కోవిడ్ -19 ప్రభావానికి లోనయ్యారు. ఇలా మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గత మూడు నెలలుగా ఏ రోజుకారోజు కేసుల సంఖ్యలో కొత్త నంబర్ నమోదవుతూ వచ్చింది. తన పక్కనున్న కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య పెరగడానికి మహారాష్ట్రనే కారణం అనే అభిప్రాయాలు వినిపించాయి మొదట్లో.
ఇలా దేశంలో అత్యధిక కరోనా కేసులతో నిలుస్తున్న మహారాష్ట్ర విషయంలో చిన్న ఊరట వార్త వచ్చింది. అదేమిటంటే.. గత 24 గంటల్లో ముంబై నగరంలో నమోదైన కేసుల సంఖ్య 700. గత మూడు నెలల్లో ఏ రోజూ కూడా ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాలేదట. ఏ రోజుకారోజు కొత్త నంబర్లు నమోదైన క్రమంలో.. తొలి సారి 700 కేసులు నంబర్ తో కాస్త చిన్న స్థాయి నంబర్ నమోదు కావడంతో ప్రభుత్వం స్వల్పంగా ఊరట పొందుతోంది. మహారాష్ట్ర మొత్తంగా కూడా గత ఇరవై నాలుగు గంటల్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009 వరకూ తగ్గింది.
అయితే ఒక రోజు నంబర్ తగ్గితే చాలకపోవచ్చు. గత ఇరవై నాలుగు గంటల్లో కూడా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా అదే నిలుస్తోంది. రోజువారీగా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గి, డిశ్చార్జిల సంఖ్య పెరిగితే.. పరిస్థితి నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నాయి.