సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుకు గురై మంగళవారం మృతి చెందినట్టుగా సమాచారం. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో రావికొండలరావు ఒకరు. ఆయనతో పాటు భార్య రాధాకుమారి కూడా సినీ రంగంలో పని చేశారు. రావికొండలరావు- రాధాకుమారిల జోడి తెలుగు సినీ ప్రియులకు చిరకాలం గుర్తుండిపోతుంది. జంటగా అనేక సినిమాల్లో నటించారు వీరిద్దరూ.
2012లో రాధాకుమారి మరణించారు. సినిమాల్లో కామెడీ తరహా పాత్రల్లో రావికొండలరావు రాణించారు. అలాగే కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లోనూ కనిపించారు. చిరంజీవి హీరోగా నటించిన 'చంటబ్బాయ్' సినిమాలో కామెడీ విలన్ పాత్రలో కనిపించారు రావి కొండలరావు. అలాగే 'పెళ్లిపుస్తకం' సినిమాలో ఆయన అభినయం మరపురానిదిగా నిలిచిపోతుంది తెలుగు సినీ ప్రియులకు.
ఆ సినిమాలో గుమ్మడి పాత్ర డైలాగులు చెబుతుంటే, ఆ డైలాగులకు అనుగుణంగా ఆయన అభినయిస్తూ ఉంటారు. అదొక విభిన్న ప్రయత్నం అని చెప్పవచ్చు. జర్నలిస్టుగా, వ్యాసకర్తగా కూడా రావి కొండలరావు అనేక వ్యాసాలు రాశారు. తను పని చేసిన సినిమాలకు సంబంధించిన విశేషాలను వివరిస్తూ ఆసక్తికరంగా ఆయన వ్యాసాలతో ఆకట్టుకున్నారు. రాత మీద చివరి వరకూ మమకారాన్ని కొనసాగించారు. కొంతకాలం కిందట 'గ్రేట్ ఆంధ్ర' ప్రింట్ ఎడిషన్ కు కూడా ఆయన పలు సినీవివరాలతో వ్యాసాలను రాశారు.