లాక్ డౌన్ టైమ్ లో కూడా స్టార్ మా ఛానెల్ జోరు తగ్గలేదు. ఒకేసారి రెండు సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంది. వీటిలో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒకటి కాగా..నాగచైతన్య చేస్తున్న లవ్ స్టోరీ మరొకటి. ఈ రెండు లవ్ స్టోరీస్ ఇప్పుడు స్టార్ మా గూటికి చేరాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై భారీ అంచనాల్లేకపోయినా ఓ మంచి ఫీల్ అయితే ఉంది. అఖిల్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. పూజాహెగ్డే ఉండడం, గీతాఆర్ట్స్-2 లాంటి బ్యానర్ యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కు దక్కిన అవకాశం కావడంతో.. అతడు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడనే ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా దక్కించుకుంది.
అటు నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా అవ్వడంతో పాటు..చైతూ-సాయిపల్లవి జంటకు మంచి క్రేజ్ రావడం ఈ సినిమాను హాట్ కేక్ గా మార్చింది. ఈ సినిమాను కూడా స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.
ఇలా టాలీవుడ్ లో హాట్ టాపిక్స్ గా ఉన్న ఈ 2 లవ్ స్టోరీస్.. స్టార్ మా ఛానెల్ కు దక్కాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ 2 సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం. లవ్ స్టోరీ సినిమాకు కేవలం 15 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉండగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి ఫైనల్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ లో ఉంది.