రామ్ గోపాల్ వర్మపై పరాన్నజీవి అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు సెటైరికల్ సినిమా తీశారు కానీ.. వాస్తవానికి ఆ పేరు చంద్రబాబుకి కరెక్ట్ గా సూటవుతుంది. సొంత సామర్థ్యం లేక, ఎప్పుడూ పక్కనోళ్లని వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు. తాజాగా ఇప్పుడు సోనూసూద్ ని వాడటం మొదలుపెట్టారు బాబు. ఆ వాడకం ఎలా ఉందంటే.. అసలు సోనూ సూద్ కి కూడా ఆ విషయం తెలియకుండా జరిగిపోతోంది.
చిత్తూరు జిల్లాలోని పేదరైతుకి ట్రాక్టర్ ఇచ్చి ఆదుకున్న దాతృత్వం సోనూసూద్ ది. అయితే ఆ వెంటనే ట్విట్టర్ లో దాన్ని ప్రమోట్ చేసుకుని తన మార్క్ తెలివితేటలు చాటుకున్నారు బాబు. అది చాలదన్నట్టు.. టీడీపీ బ్యాచ్ ని వెంటనే రంగంలోకి దించారు. ఇంకేముంది సోనూ సూద్ ట్రాక్టర్ ఇచ్చిన విషయం మరుగునపడిపోయేట్టు.. చంద్రబాబుకి ప్రచారం మొదలైంది.
చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల సోనూ సూద్ ఫ్లెక్సీలు వెలిశాయి. రైతుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్టు పాలాభిషేకాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటో ఉండటం గమనార్హం. సాయం చేసింది సోనూ అయితే.. ప్రచారం బాబుదన్నమాట. ఈ ఫొటోలు బైటకి రావడంతో చంద్రబాబుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు సోనూ సూద్ కి, చంద్రబాబుకి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు.
అసలు చంద్రబాబు తన జీవితమంతా ఇలా పరాన్నజీవిలాగే బతికేశారు. కొన్నాళ్లు వామపక్షాలతో అంటకాగారు, అవకాశం ఉంటే బీజేపీ పంచన చేరేవారు. చివరకు టీడీపీ పుట్టుకనే అపహాస్యం చేసేలా కాంగ్రెస్ తోనూ జతకట్టిన అవకాశవాదం బాబుది. టీఆర్ఎస్ తోనూ కలసి పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని, జనసైనికుల్ని, జనసేనానిని ఏ రేంజ్ లో వాడారో అందరికీ తెలిసిన విషయమే. అయితే తన వాడకం అయిపోయాక, తనకి పనికిరాడని తెలిశాక అంతే తెలివిగా పక్కనపెట్టేస్తారు బాబు.
ఇలా బాబు రాజకీయ జీవితమంతా పరాన్నజీవిలాగా ఇతరులపై ఆధారపడుతూ సాగింది. చంద్రుడికి స్వయంప్రకాశ శక్తి ఎలా లేదో.. చంద్రబాబుకి కూడా అలాంటి సొంత బలం ఎప్పుడూ లేదు. ఇతరులపై ఆధారపడి బతకడమే బాబు పాలసీ, ఫిలాసఫీ. అలాంటి చంద్రబాబు ఇప్పుడు సోనూ సూద్ ని వాడటం మొదలు పెట్టారు. చిత్తూరు జిల్లాలో వెలసిన సోనూ ఫ్లెక్సీలు, వాటిల్లో చంద్రబాబు ఫొటోలు.. ఇదంతా బాబు చీప్ టెక్నిక్స్ ని మరోసారి బైటపెట్టాయి.