ఏదైనా పరాయి భాష సినిమాను రీమేక్ చేస్తూ ఉన్నప్పుడు.. రెండో వెర్షన్ విడుదలయ్యాకా.. ఒరిజినల్ తో పోలిక వస్తూ ఉంటుంది. అయితే మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయుం రీమేక్ భీమ్లానాయక్ మాత్రం అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ పోతోంది! ఆ సినిమాకు రీమేక్ ఇలా ఉంటుందా? అని ఒరిజినల్ ను చూసిన వాళ్లకు వరస ఆశ్చర్యాలే మిగులుతున్నాయి!
టైటిల్ దగ్గర నుంచినే భీమ్లానాయక్ పూర్తి వేరే రూట్ తీసుకుంది! మలయాళీ వెర్షన్లో రెండు ప్రధాన పాత్రల పేర్లూ టైటిల్ లో ఉంటాయి. ఆ రెండు పాత్రల పేర్లే టైటిల్! వేరే ఇంకేం లేదు! అయ్యప్పన్, కోషీ ఇంతే టైటిల్. రెండు పేర్లే టైటిల్ గా కలిగిన సినిమాను రీమేక్ చేస్తూ.. రెండో పేరునే టైటిల్లోంచి లేపేయడం ఈ రీమేక్ కు సంబంధించి పెద్ద కామెడీ!
మరి సినిమాలో అయినా.. రెండో పాత్రకు తగినంత నిడివి ఉంటుందో, లేక ఏకపాత్రాభినమే సాగుతుందో.. సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఆ సంగతలా ఉంటే.. ఇక ఈ సినిమాకు సంబంధించి, నిత్యామేనన్, పవన్ కల్యాణ్ ల జాయింట్ లుక్ గురించి సోషల్ మీడియాలో సెటైర్లు తప్పడం లేదు!
ఒరిజినల్ ప్రకారం.. నిత్య ది ఒక ట్రైబల్ లేడీ పాత్ర. మాజీ నక్సల్ తరహా పాత్ర. మలయాళీ వెర్షన్లో ఆ పాత్రను చేసిన నటి, తన నడకలో కూడా ఆ పాత్రను ఆవిష్కరించింది! ఇక ఆమె కాస్టూమ్స్, నో మేకప్.. ఇవన్నీ కూడా ఒక ట్రైబల్ లేడీ ఎలా ఉంటుంది, పిల్లల తల్లి ఎలా ఉంటుంది, కొండ ప్రాంతంలో నివసించే ఒక మాస్ పోలీసాఫీసర్ భార్య ఎలా ఉంటుందనే.. అన్ని నిర్వచనాలకూ తగ్గట్టుగా ఉంటుంది ఆ పాత్ర!
నిత్య లుక్ విషయానికి వస్తే.. పై నిర్వచనాల్లో దేనికీ సంబంధం కనిపించడం లేదు! ఇంతకీ ఇది అయ్యప్పన్ రీమేకేనా.. లేక వేరే సినిమా ఏదైనానా.. అనేంత స్థాయిలో కనిపిస్తోంది తేడా! వెనుకటికి.. వేర్వేరు భాషల్లో వచ్చిన సినిమాలను భోజ్ పురిలో పరిమిత బడ్జెట్ వనరుల్లో రీమేక్ చేసుకునే వారు. రిచ్ సినిమాలను పరమ పూర్ గా తీస్తారనే పేరు వాటికి. ఇప్పుడు పవన్ కల్యాణ్ రీమేక్ సినిమాల వరసను పరిశీలిస్తే.. పూర్ బ్యాక్ గ్రౌండ్ ను కూడా రిచ్ గా మార్చేసి, డీ గ్లామర్ ను గ్లామరస్ గా మార్చేయడమే పనిగా మారినట్టుగా ఉంది!