“మా” ఎన్నికల్లో విజయం ఎవరిదౌతుంది అనే దాని మీద ట్విటర్ లో పోల్ నిర్వహించాం.
68% మంది ప్రకాష్ రాజ్ గెలుస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతానికి దాదాపు 2400 ఓట్లు నమోదయ్యాయి. అయితే వీరంతా జెనెరల్ పబ్లిక్. “మా” సభ్యులు వీరిలో పెద్దగా ఉందకపోవచ్చు.
అసలు “మా” ఓట్లు మొత్తం 900. అందులో పోలయ్యేవి ఎన్నో తెలియదు.
ఇదే విధంగా ఒక టీవీ ఛానల్ వారు కూడా పోల్ నిర్వహించారు. అక్కడ కూడా ఆశ్చర్యంగా 68% ప్రకాష్ రాజ్ కి మొగ్గు చూపుతున్నారు. అంటే జనానికి ప్రకాష్ రాజ్ గెలవాలని ఉంది. ఎందుకు?
గత కొన్నాళ్లుగా టీవీల్లో ఇరువర్గాల ప్రచారాన్ని చూస్తున్నారు. ఇద్దరి ఇంటర్యూలూ చూస్తున్నారు. సహజంగా ఆయా నటులపై ఉన్న అభిమానం కొంత, ఈ ఇంటర్వ్యూల్లో మాట్లాడేటప్పుడు నచ్చుబాటు కొంత ఈ పోల్ ని ప్రభావితం చేసుండొచ్చు.
అయితే అసలు “మా” మెంబర్స్ ఎవరికి ఓటేయొచ్చు? జెనరల్ పబ్లిక్ ఓటింగ్ ని ప్రాతిపదికగా తీసుకుని ఎగ్జిట్ పోల్ చెప్పవచ్చా? పబ్లిక్ లెక్క, “మా” ఓటర్స్ లెక్క ఒకటవుతుందా?
అసలు ఇండస్ట్రీ జనాలు ఏమనుకుంటున్నారు?
ఈ విషయం మీద ఒక నిర్మాతని అడిగితే, “మొహమాటానికి ఇష్టం నటించడానికి, మనస్ఫూర్తిగా ఇష్టపడడానికి చాలా తేడా ఉంటుంది. చాలామంది మొహమాటానికో భయానికో మంచు విష్ణు వర్గానికి “ఫర్” గా నటిస్తున్నా మనసులో మాత్రం ప్రకాష్ రాజ్ కే ఓటెయ్యాలనుంది. నా మిత్రుల్లో ఉన్న నలుగురు “మా” సభ్యులు ఇదే మాట చెప్పారు”, అన్నారు.
ఒక మెంబరైతే, “నాగబాబు ఈ రోజు ఒక అనుమానం వ్యక్తపరిచారు. విష్ణు వర్గం ఓటర్లకి డబ్బులు పంచుతోందని ఆరోపించారు. అది నిజమైతే తేడా రావొచ్చు గానీ లేకపోతే ప్రకాష్ రాజ్ గెలుపుకే చాన్స్ ఎక్కువ” అన్నారు.
ఇంకొకరైతే, “ప్రకాష్ రాజ్ జాతీయ నటుడు. ఎప్పుడెక్కడుంటాడో ఆయనకే తెలియదు. విష్ణు అయితే ఇక్కడే ఉంటాడు. కనుక కామన్ సెన్స్ ఉన్నవాడెవడైనా విష్ణుకే ఓటేస్తాడు. గెలిచిన నాయకుడు అందుబాటులో ఉండొద్దూ?”, అన్నారు.
“ప్రకాష్ రాజ్ ని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరికైనా మనసొస్తుంది. ఆయన ప్రజల మనిషిలా ఉంటాడు. విష్ణు గెలిచాక అందరికీ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానమే. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంకొకరు దీనికి వ్యతిరేకంగా ఆలోచించొచ్చు. కనుక ఎవరు గెలుస్తారో చెప్పడం తేలిక కాదు”, అని మరొక మెంబర్ అన్నారు.
ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ, “ఎంతమంది మెంబర్లు రోజూ “మా” కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటున్నారు? గెలిచినవాడు ఎక్కడున్నా ఇవాళున్న సాంకేతికతతో ఎక్కడునుంచైనా మాట్లాడొచ్చు. అందుబాటులో ఉండడమన్నది పాయింటే కాదు. ఎటొచ్చీ అకౌంట్స్ కి ఆన్సరెబిలిటీ తప్ప ఇక్కడ బరువైన బాధ్యత తప్ప మరొకటేమీ ఉండదు. ఒక ప్యానల్ మీద ఇంకొక ప్యానల్ చేసే ఆరోపణలు కూడా అకౌంట్స్ గురించే తప్ప ఇంకోటేమీ లేదు కదా. చెప్పుకోవడానికైతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గెలుస్తాడనిపిస్తోంది. పోటీ మాత్రం నెక్ టు నెక్ ఉంటుంది”, అని ఒక నిలువెత్తు దర్శకనిర్మాత చెప్పారు.
“ఎవరు గెలిచినా మార్జిన్ చాలా టైట్ గా ఉంటుంది. 50-70 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఎవరైనా. కనుక ఆ కొద్ది పాటి తేడాలో విజయమెవరిదౌతుందో ఊహించి చెప్పడం కష్టం. నా దృష్తిలో ఇద్దరూ సమర్థవంతులే. ఎవరు గెలిచినా ఓకే” అన్నారు ఒక ప్రముఖ కెమెరామన్.
మొత్తమ్మీద రెగ్యులర్ ఎలక్షన్స్ మాదిరిగా “మా” ఎన్నికల మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండడం, ఎవరు గెలుస్తారా అని సినీ జనాలు లెక్కలేసుకోవడం ప్రస్తుతం ప్రేక్షకులకి దక్కుతున్న వినోదం.
గ్రేట్ ఆంధ్రా బ్యూరో