కరోనా పాపం తలా పిడికెడు

ఆ మధ్య ఓ వాట్సాప్ జోక్ చదివాను. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుంది.  అప్పుడు సైక్రియాట్రిస్ట్ సింపుల్ గా ఇలా అంటాడు…''నువ్వు పెళ్లి చేసుకోపోతే, మొగుడు అనే వాడు లేకపోతే, జీవితంలో వచ్చే…

ఆ మధ్య ఓ వాట్సాప్ జోక్ చదివాను. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుంది.  అప్పుడు సైక్రియాట్రిస్ట్ సింపుల్ గా ఇలా అంటాడు…''నువ్వు పెళ్లి చేసుకోపోతే, మొగుడు అనే వాడు లేకపోతే, జీవితంలో వచ్చే నీ ఫెయిల్యూర్స్ ఎవరి ఖాతాలో వేస్తావు'' అని. ప్రపంచంలో అతి తేలికైన, సులువైన పనులు కొన్ని వున్నాయి. నెగిటివ్ ఫలితాన్ని ఎదుటివాడి మీదకు తోసేయడం అన్నది ఇలాంటి సులువైన పనుల్లో ఒకటి. కరోనా మహమ్మారి విషయంలో జరుగుతున్నది అదే. మనకు కరోనా రాకపోతే మన ఇమ్యూనిటీ ఘనత. మనకు కరోనా వస్తే ప్రభుత్వం,

అధికారుల వైఫల్యం

దాదాపు నాలుగున్నర నెలలు గడిచిపోయాయి కరోనాతో మన సహజీవనం చేస్తూ.  సహజీవనం చేస్తేనే ఎవరు ఎలాంటి వారో తెలిసేది. దానిని బట్టి ఒకరికి అనుగుణంగా మరొకరు సర్దుకునేది.  అలా తెలిసిన తరువాత కూడా సర్దు కోలేదంటే, ఇక ఆ జంట  ఖర్మ అనుకోవాలి లేదా మూర్ఖత్వం అనుకోవాలి.  కరోనాతో మనం అంటే జనం సహజీవనం చేయడం ప్రారంభించాం. ముందు అదో రాక్షసి అనుకున్నాం. కనిపిస్తే తినేస్తుంది అని భయపడ్డాం. కొన్నాళ్లు ఇళ్లలో వుండిపోతే, ఎవ్వరూ కనిపించక, ఈ రాక్షసి వెనక్క మళ్లీ వెళ్లిపోతుంది అనుకున్నాం.

కొంతమంది కూర్చున్నారు. కొంతమంది తిరిగారు. రాక్షసి వెనక్కు వెళ్లే మూడ్ లో వుండగా, ఇంక కాస్త అటు ఇటు తిరగొచ్చు అన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.  ఇక్కడ అసలు తొలి తప్పు జరిగింది. ఎందుకు వెసులు బాటు ఇస్తున్నాం అన్నది క్లారిటీగా చెప్పలేదు. ఏ మేరకు వెసులు బాటు అన్నది మనం అంటే జనం గ్రహించలేదు. పగ్గాలు తెంచుకున్న తీరుగా రోడ్ల మీదకు వచ్చాం.

ఆర్దిక సమస్యలు

మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కూడా పక్కా బడుగు జీవుల బతుకు లాంటిదే. రెక్కాడితే కానీ డొక్కాడదు బడుగు బతుకులకు. వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు సాగితే తప్ప నిధులు రావు ప్రభుత్వాలకు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు కుదేలయిపోయాయి. రాష్ట్రప్రభుత్వాలు ఉన్న నిధులను ఎప్పటికప్పుడు పథకాల పప్పు బెల్లాలకు పంచేస్తుండడంతో, లాక్ డౌన్ అంటే ఆర్ధిక నీరసం అలుముకుంది.

పిల్లలను ఇంట్లో కట్టి పడేస్తే, తల్లే కదా? ఏదో ఒకటి చేసి పెట్టాల్సింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం వైపు చూసాయి.. సాయం..మోడీ మహాప్రభో అన్నాయి. కానీ మన మోడీగారు ఫక్తు గుజరాతీ. ఎక్కడైనా బావ కానీ వంగతోట కాదన్నట్లు, అదియును నీ పతి ప్రాణంబు దక్క అని యమధర్మరాజు అన్నట్లుగా, డబ్బులు తప్ప ఏమైనా అడగండి అనే టైపు ఆయన. అరచేతిలో వైకుంఠం వరకు ఒకె…కట్టి చూపించమంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. పైగా రాష్ట్రాలకు విరివిగా డబ్బులు జల్లేయడం అంటే ఆయనకు అస్సలు కిట్టదు. అణాపైసలతో సహా లెక్కలు చెప్పాల్సిందే.  మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలా లెక్కలు చెప్పడం అంటే ఇబ్బంది.

ఇలా దానాదీనా ఏమయింది. ఇంట్లో వుండమంటే కదా,చేసి పెట్టమంటున్నారు అని తల్లి అనుకుని, బయటకు పోయి తినండి అన్న చందంగా, మీకు వెసులు బాటు వుంటే మార్కెట్లు తీసుకుని వ్యాపారాలు సాగేలా చూసి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వుండండి అని కేంద్రం చెప్పేసింది. లిక్కర్ షాపుల మీదే అసలు సిసలు ఆదాయం కాబట్టి వాటిని కూడా తీసేసుకోండి అంది.

జనం గమనించనిది

ఇంక జనం గమనించాల్సిన పాయింట్ ఒకటి వుంది. అసలు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా వుంది అని గ్రహించి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది?  మీకు కావాలంటే లాక్ డౌన్ పెట్టుకోండి అని అనలేదు కదా? లాక్ డౌన్ విధించింది కేంద్రమే. కానీ ముడి విప్పేటపుడు చూడాల్సింది కూడా కేంద్రమే కదా? అలా చూడకుండా, లాక్ డౌన్ తీసేసింది. మీకు కావాలంటే పెట్టుకోండి అంటూ రాష్ట్రాలకు ఒక ఉచిత సలహా ఇచ్చేసింది.

లాక్ డౌన్ విధించే ముందు పరిస్థితులు తనంతట తాను తెలుసుకుని, తనంతట తాను లాక్ డౌన్ విధించినపుడు, అదే కేంద్రం మళ్లీ లాక్ డౌన్ సడలించేటపుడు రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా వున్నాయో, లేదో తెలుసుకోవాలి కదా? నిబంధనలు సడలించేసి, 'మీ ఇష్టం…లాక్ డౌన్ సడలింపు వ్యవహారం మీకే వదిలేస్తున్నాం ' అని రాష్ట్రాల మీదకు నెట్టేయడం ఏమిటి?

ఎందుకంటే పద్మవ్యూహంలో ప్రవేశించడం సులువు. బయటకు రావడం కష్టం అన్నట్లుగా, లాక్ డౌన్ విధించడం సులవు. సడలించడం అంత వీజీ కాదు. సడలిస్తే ఎన్ని తలకాయనొప్పులు వస్తాయో కేంద్రానికి తెలుసు. అందుకే సింపుల్ గా రాష్ట్రాలకు వదిలేసింది. లిక్కర్ షాపులు తీసుకోవచ్చు. కానీ తీసుకోవాలో వద్దో మీ ఇష్టం అంది. ఇదెక్కడి వ్యవహారం అని ఎవ్వరూ అనుకోలేదు. ఆలోచించలేదు. కేంద్రం సడలించేసింది అన్నది మాత్రమే చూసుకున్నారు. రాష్ట్రాలకు తెలిసినా కిమ్మనే పరిస్థితి లేదు. గిల్లితే గిల్లించుకోవాలి తప్ప మాట్లాడడానికి లేని పరిస్థితి.

ఎవరి వీక్ నెస్ లు వారివి.

పైగా రాష్ట్రాల ఆదాయం సంగతి వాటినే చూసుకోమని వదిలేసిన కేంద్రం, తన దగ్గర వున్న రైల్వేలను కూడా లాక్ డౌన్ నుంచి మినహాయించింది. వలస కార్మికులను ఆదుకోవడం లేదన్న అపప్రధ నుంచి  తప్పించుకోవడానికి అంతరాష్ట్ర రవాణాకు అనుమతి ఇచ్చేసింది. దాంతో దేశం అంతా కేసులు వ్యాపించడానికి చక్కటి వెసులుబాటు దొరికింది.  అస్సలు కేసులు లేని శ్రీకాకుళం లాంటి జిల్లాలాంటివి కూడా కేసుల బారిన పడిపోయాయి.

బాధ్యత రాష్ట్రాల పైకి

ఆ విధంగా కరోనా కట్టడి బాధ్యత కేంద్రం నుంచి రాష్ట్రాల భుజాలపైకి వచ్చింది. అసలే ఆర్థిక సమస్యలతో కూనారిల్లుతున్న రాష్ట్రాలు. లాక్ డౌన్ కారణంగా ఆదాయం నష్టపోయిన రాష్ట్రాలు. కరోనా లాంటి మహమ్మారి ఎప్పటికైనా విరుచుకుపడుతుంది అని కలగనని రాష్ట్రాలు, అందుకు సన్నద్దంగా లేని రాష్ట్రాలు, వ్యాపారస్థులే రాజకీయ నాయకులు కావడంతో, విద్యను, వైద్యాన్ని ఎప్పుడో కార్పొరేట్ కు వదిలేసిన రాష్ట్రాలు ఇప్పుడు ఏం చేయగలవు?

పోలీసులను వాడి జనాలను కట్టడి చేయడం. ఇది ఖర్చు లేని పని.

మద్యం అమ్మి నిధులు పొగు చేయడం. ఇది అంతకన్నా సులువైన పని.

కానీ వైద్యం అందించడం, జనాలను కట్టడి చేయడం అన్నది మాత్రం అంత సులువు కాదు. ఇప్పటి వరకు రాష్ట్రాల దగ్గర వున్న వైద్య సదుపాయాలు ఏ మేరకు. వెయ్యి మంది జనాభా వుంటే ఓ పిహెచ్ సి, లక్ష మంది జనాభా వుంటే ఓ వంద పడకల ఆసుపత్రి, లక్షల జనాభా వుంటే ఓ పెద్దాసుపత్రి. ఇదే పద్దతి కదా? ఏ రాష్ట్రానిదైనా?

మ్యాన్ పవర్ సమస్య

పైగా ఈ కరోనాతో అసలు సిసలు సమస్య ఏమిటంటే, వెంటిలేటర్లు. మామూలువైద్యం చాలదు. అప్పటికప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి దీనిది. ఉన్నట్లుండి మనిషికి శ్వాస అందకుండా చేసే మహమ్మారి ఇది. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. 30 పడకల ఆసుపత్రులు వున్న పట్టణాల్లో అంతకు రెండింతల కేసులు రోజూ వస్తుంటే? ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? మందులు, సదుపాయాలు, వెంటిలేటర్లు సరే, మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?  డాక్టర్లు అంటే బజార్లో దొరికే సరుకులు కాదు కదా? చటుక్కున తీసుకవచ్చి లోపల పడేయడానికి?  

జనాల ఆలోచన?

ఇదిలా వుంటే జనాల ఆలోచన వేరుగా వుంది. అసలు లిక్కర్ షాపులకు ఎందుకు అనుమతి ఇవ్వాలి? అందువల్లే కరోనా వ్యాప్తి వచ్చింది. నిజమే అనుకుందాం.  లిక్కర్ షాపులు తీయరు. ప్రభుత్వానికి ఆదాయం వుండదు. మరి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ ఎలా? కేంద్రం ఇవ్వదు. చేస్తున్న అప్పులు పప్పు బెల్లాల పథకాలకే చాలవు.  మరి ఎలా?  వ్యాపారాలు, వ్యవహారాలు నడవకపోతే చిన్న, సన్నకారు ఉద్యోగులను ఆదుకునేది ఎవరు? ఆ భారం కూడా ప్రభుత్వం మీదే పడుతుంది కదా? అదే సమయంలో వ్యాపారాలు ఆగిపోతే ఆర్థిక వ్యవస్థ గాడితప్పిపోతుంది. అందుకే కేసిఆర్ లాంటి వాళ్లు హెలికాప్టర్ మనీ లాంటి కొత్త ఆలోచనలు సజెస్ట్ చేసింది. కానీ కేంద్రం సాయం చేయడం మినహా దేనికైనా రెడీ.

వ్యాపార దృక్పథం

లాక్ డౌన్ తీసేయగానే మన వ్యాపారాలు పురి విప్పినవి పురివిప్పాయి. కళ తప్పినవి కళ తప్పాయి. ముఖ్యంగా ప్రయివేటు వైద్యం జడలు విప్పుకుంది. మాస్క్ లు, శానిటైజర్ల వ్యాపారం ఊపందుకుంది. ఆసుపత్రులు ఇధే అదను అని దోచుకోవడం ప్రారంభించేసాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది, సదుపాయాల కొరత, ఇటు కార్పొరేట్ వైద్యం అందని వైనం. దీంతో మొత్తం వ్యవహారం రివర్స్ అయిపోయింది.

మరోపక్క ఎప్పుడయితే కరోనా అన్నది కామన్ డిసీజ్ అన్న ఆలోచన జనాల్లో పెరిగిపోయిందో విచ్చలవిడితనం అదుపుతప్పింది. జనాలకు భయం అనేది లేకుండా పోయింది. మాస్క్ లు వాడేవారు తగ్గిపోయారు. నిబందనలు పాటించేవారు తగ్గిపోయారు.

నాయకులు-జనాలు దొందూదొందే

కరోనా విషయంలో నాయకులు కూడా జనాలకు ఏమాత్రం తీసిపోలేదు. కరోనా వున్నదని నాయకులు తమ కార్యక్రమాలు ఏవీ ఆపలేదు. పుట్టిన రోజులు, సంస్మరణలు, పర్యటనలు అన్నీ యధావిధిగా సాగిపోయాయి. ఇది చూసి జనం కూడా టేక్ ఇట్ ఈజీ అనుకున్నారు. దాంతో కరోనా వ్యాప్తి ముమ్మరం అయిపోయింది. ఇప్పుడు జనాలు ఏమంటున్నారు. కరోనా పట్ల ప్రభుత్వం సీరియస్ గా లేదంటున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వున్నారంటున్నారు. ఆ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ పదుల సంఖ్యలో విలేకరులు ఒకరి మీద ఒకరు పడిపోయిన ఫొటో ఒకటి వైరల్ అయింది. అది చూస్తే ఎవరికి బాధ్యత లేనట్లు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కరోనాను కట్టడి చేయడానికి ముందు వరుసలో వుండాల్సిన వైద్య సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య సిబ్ధంది ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతుంటే, సౌకర్యాలు సదుపాయాలు ఎలా అందుతాయి?

ప్రభుత్వ తప్పిదం

ప్రభుత్వం కరోనా ఫైట్ లో ప్రజలను భాగస్వాములను చేయకపోవడం పెద్ద తప్పిదం. ఆసుపత్రుల్లో, రొడ్ల మీద కరోనాను ఎదుర్కోవడానికి స్వచ్చంధంగా ముందుక వచ్చేవారిని సమీకరించి వుండాల్సింది. అప్పుడు ప్రజలకు కూడా బాధ్యత, కష్టం రెండూ తెలిసేవి. పైగా సిబ్బంది కొరత, ఆర్థిక సమస్యలు కాస్త తీరే అవకాశం వుండేవి. అనేక స్వచ్ఛంధ సంస్థలు తప్పనిసరిగా ముందుకు వచ్చి వుండేవి.

కరోనా కట్టడి టైమ్ లో ప్రభుత్వాలు వీర ప్రగల్భాలు పలికాయి. మండలానికి పదివేల పడకలు,  జిల్లాకు లక్షపడకలు రెడీ చేస్తున్నాం అని అన్నారు. కానీ తీరా లాక్ డౌన్ టైమ్ లో అంత అవసరం లేదనట్లుగా ప్రభుత్వాలు ఊరకుండిపోయాయి. తీరా కరోనా విజృంభించిన తరువాత సదుపాయాలు లేకుండాపోయాయి.

పరిక్షల అయోమయం

ప్రజలకు కరోనా పరిక్షల విషయంలో తెలిసింది ఒకటే పాజిటివ్-నెగిటివ్. ఈ పరిక్షలు అన్నది కాకిలెక్కలుగా మారిపోయాయి. పరిక్షల విషయంలో ప్రభుత్వాలు మరింత క్లారిటీగా వ్యవహరించి వుంటే బాగుండేది. రాపిడ్ టెస్ట్ లు, స్వాబ్ టెస్ట్లు, యాంటీ బాడీ టెస్ట్ లు, ఇలా చాలా రకాలు వున్నాయి. ఊళ్ల నుంచి వచ్చిన వారు, స్వచ్ఛందంగా వచ్చిన పరిక్షల కోసం వచ్చిన వారు. ఇలా చాలా మంది వున్నారు.  వివరంగా తెలియచేస్తే, అంటు వ్యాధిలా అలుముకుంటోందా? లేక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ లు వస్తున్నాయా? అన్నది క్లారిటీ వచ్చేది.

ఒక్కోప్రాంతంలో వున్నట్లుండి కేసలు వస్తున్నాయి. ఉన్నట్లుండి తగ్గిపోతున్నాయి. మళ్లీ వున్నట్లుండి వస్తున్నాయి. అంటే అక్కడ ఏం జరుగుతోందన్న విశ్లేషణ చేస్తున్నట్లు కనిపించడం లేదు. పరిస్థితిని ప్రజలకు వివరించే యత్నం కనిపించడం లేదు. దీంతో జనం కరోనా పెరిగిపోతోందని అనుకోవడం తప్ప, తమ వంతు బాధ్యత ఏమిటీ అన్నది ఆలోచించడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో కేంద్రం మొత్తం వ్యవహారం రాష్ట్రాలకు వదిలేసి, అలా అలా చూస్తూ వుంది. ప్రజలు కూడా ప్రభుత్వాలదే బాద్యత ఏదో ఒకటి చేయాల్సింది అని అనుకుంటున్నారు. ప్రజలు బాధ్యతారాహిత్యంగా వున్నా, కట్టడి చేసే అవకాశం లేక, సిబ్బంది లేక, తమ వైపు కూడా తప్పిదాలు వున్నాయి కనుక మౌనంగా వుంటున్నాయి ప్రభుత్వాలు.

ఇలా కేంద్రం, రాష్ట్రం, ప్రజలు కలిసి ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి కృషి అనేది కరువై కరోనా మహమ్మారి కట్టలు తెంచుకుని దూకుతోంది. ఇలాంటి టైమ్ లో వ్యాక్సీన్ వస్తే చాలు మొత్తం పనైపోతుంది అని ఈ వర్గాలు అన్నీ ఎదురు చూస్తున్నాయి. అదే వ్యాక్సీన్ల వెనుక కూడా తెలియని నిజాలు, ప్రలోభ ప్రచారాలు, ఇంకా ఎన్నో.

మొత్తం మీద కరోనా ఓ సత్యాన్ని చాటింది. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ప్రజలూ ఏమీ చేయరు. ఏం జరిగినా ఏదో అధ్భుతం దానంతట అదే జరగాలి.

-చాణక్య
[email protected]