కుప్పంలో చంద్రబాబునాయుడి విజయాలకు అడ్డు కట్ట వేస్తే, టీడీపీకి శాశ్వతంగా సమాధి కట్టొచ్చని వైసీపీ అనుకుంటోంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో చంద్రబాబునాయుడిని ఓడించే బాధ్యతల్ని సీఎం జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు వరుస విజయాలపై వైసీపీ పోస్టుమార్టం చేస్తోంది. ప్రధానంగా చంద్రబాబు విజయాల్లో దొంగ ఓట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వైసీపీ నమ్ముతోంది.
కుప్పంలో మొత్తం 30 వేల దొంగ ఓట్లు ఉన్నాయని అధికార పార్టీ లెక్క తేల్చింది. మాయల పకీరు ప్రాణంలో చిలుకలో ఉన్నట్టుగా, చంద్రబాబు విజయం దొంగ ఓట్లలో వుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కర్నాటక సమీపంలో కుప్పం వుండడంతో అక్కడి వారి ఓట్లను పెద్ద సంఖ్యలో చేర్చారని వైసీపీ నేతలు లెక్కలతో సహా చెబుతున్నారు. కుప్పంలో దొంగ ఓట్లను పూర్థిస్థాయిలో అరికడితే మాత్రం చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసినట్టే అని వైసీపీ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ దొంగ ఓట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగనోట్లను ఏరివేస్తున్నారని టీడీపీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు. కుప్పంలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లను కాపాడుకునేందుకే టీడీపీ పోరాటం చేస్తోందని ఆయన విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ ఓట్ల అంతు తేల్చాల్సిందే అని ఆయన అంటున్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీగా 30 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని, అందుకే వాటిని తొలగించాలనే పట్టుదలతో వైసీపీ వుంది. అయితే దొంగ ఓట్లని నిర్ధారించేందుకు వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.