మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి మరోసారి బరిలో దిగాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తుమ్మలకు సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. పాలేరు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి కట్టబెట్టడంతో తుమ్మలతో పాటు ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో పాలేరు బరి నుంచి పోటీ చేయాల్సిందే అని తుమ్మలపై ఆయన అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకూ తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన చేశారు. వేలాది వాహనాల్లో తుమ్మల వెంట ఖమ్మానికి అనుచరులు వెళ్లారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే తుమ్మల నిర్ణయం వుంటుందన్నారు.
తాము ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామన్నారు. తుమ్మలకు ఘన స్వాగతం పలుకుతూ కేవలం ఆయన ఫొటోలు తప్ప, కేసీఆర్ ఫొటోలు లేకపోవడం, బీఆర్ఎస్ జెండా కనిపించకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు యుగంధర్ స్పందిస్తూ వాళ్లంతా తుమ్మల అభిమానులన్నారు. అన్ని పార్టీల్లోనూ తుమ్మల అభిమానులున్నట్టు ఆయన చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల అభివృద్ధి చేశారని, అందుకే అన్ని చోట్ల ఆయనకు అనుచర గణం వుందన్నారు.
ఇదిలా వుండగా 2018లో పాలేరు నుంచి టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్‌లో కందాల చేరారు. ఇటీవల మరోసారి ఆయనకే కేసీఆర్ టికెట్ ఖరారు చేయడంతో తుమ్మల అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు సమావేశాలు పెట్టుకుని పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని తీర్మానాలు చేయడం గమనార్హం. మరోవైపు తుమ్మల రాకను స్వాగతిస్తామని అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుకాచౌదరి అన్నారు.
తుమ్మల అనుచరుల డిమాండ్ కూడా కాంగ్రెస్‌లో చేరాలని ఉండడంతో, నాగేశ్వరరావు దృష్టి కూడా అటు వైపే వుండొచ్చనే చర్చ జరుగుతోంది. తాజాగా ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు లేకపోవడంతో తుమ్మలకు ఆ పార్టీతో అనుబంధం తెగేందుకు సమయం దగ్గర పడుతోందని అంటున్నారు. గతంలో టీడీపీలో తుమ్మల హవా నడిచింది. అయితే తెలంగాణలో టీడీపీ ఉనికి లేకపోవడంతో ఆయన కేసీఆర్ పంచన చేరారు. కేసీఆర్ కూడా పాత స్నేహాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నారని, ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చినా నెగ్గలేరనే ఉద్దేశంతో తుమ్మలకు నిరాకరించినట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తుమ్మల తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ మాత్రం వుంది.