ఈ సినిమాపై ట్రోలింగ్.. ఆ సినిమాపై సానుభూతి

జాతీయ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్ లో కొంతమంది పండగ చేసుకుంటున్నారు. ఓ మోస్తరు పండగ వాతావరణం కనిపిస్తోంది. అయితే అటు కోలీవుడ్ జనాలు మాత్రం కుతకుతలాడిపోతున్నారు. దానికి కారణం, వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న…

జాతీయ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్ లో కొంతమంది పండగ చేసుకుంటున్నారు. ఓ మోస్తరు పండగ వాతావరణం కనిపిస్తోంది. అయితే అటు కోలీవుడ్ జనాలు మాత్రం కుతకుతలాడిపోతున్నారు. దానికి కారణం, వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాకు అవార్డ్ రాకపోవడమే. అదే జై భీమ్.

సూర్య హీరోగా నటించిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈ కోర్టు డ్రామాకు కచ్చితంగా అవార్డ్ వస్తుందని తమిళ ప్రేక్షకులు, కోలీవుడ్ మీడియా భావించింది. కానీ ఈ సినిమాకు ఏ కేటగిరీలో అవార్డ్ దక్కకపోవడం బాధాకరం.

జై భీమ్ తో పాటు.. సార్పట్ట, కర్ణన్, మానాడు లాంటి సినిమాలు కూడా నేషనల్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యాయి. కానీ వీటన్నింటికంటే జైభీమ్ పైనే ఎక్కువ అంచనాలుండేవి. కానీ జ్యూరీ ఈసారి సూర్య సినిమాను పట్టించుకోలేదు. అంతకుముందే, ఆకాశం నీ హద్దురా సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు సూర్య.

ఓవైపు సూర్య సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు కశ్మీర్ ఫైల్స్ సినిమాకు జాతీయ సమైక్యత కింద నర్గీస్ దత్ అవార్డును ప్రకటించడాన్ని చాలామంది నిరశిస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు వివాదాలకు కారణమైంది. మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమాకు మరో కేటగిరీలో అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేదని, జాతీయ సమైక్యత కింద అవార్డ్ ప్రకటించడం దారుణం అంటున్నారు చాలామంది.

స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఈ సినిమాపై కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైన తమ సినిమాకు అవార్డ్ రావడాన్ని ప్రశ్నిస్తే, దేశాన్నే ప్రశ్నించినట్టని అన్నారు. లాబీయింగ్ చేసి అవార్డు తెచ్చుకోలేదని, అలా చేసి ఉంటే, అన్ని అవార్డులు తమకే వచ్చి ఉండేవని అన్నారు.