చారిత్రక ఘట్టం.. ప్రజ్ఞాన్ తొలి అడుగులు ఇవే!

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఇప్పుడు ఆ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్…

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఇప్పుడు ఆ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకొచ్చింది. చంద్రుడిపై తొలి అడుగులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఈరోజు ఇస్రో విడుదల చేసింది.

ల్యాండర్, రోవర్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు ప్రకటించింది ఇస్రో. ప్రయోగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్ని ఆన్ చేసినట్టు వెల్లడించింది. ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు సాగిస్తుంది. అదే టైమ్ లో ల్యాండర్ కూడా పని చేస్తుంది.

దక్షిణ ధృవంపై 2 వారాల తర్వాత చీకట్లు అలుముకుంటాయి. అదే టైమ్ లో భారీ ఇసుక తుఫానులు, కంపనాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా మైనస్ వంద డిగ్రీలకు పడిపోతాయి. దీంతో రోవర్, ల్యాండర్ తమ శక్తిని కోల్పోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ 14 రోజులు ఏం చేయబోతున్నారు..

చంద్రుడిపై దిగిన ల్యాండర్ బరువు 1752 కేజీలు. అందులోంచి బయటకొచ్చిన రోవర్ బరువు 26 కేజీలు. ఈ రెండూ ఒకదాన్ని మరొకటి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. సెకెనుకు సెంటీమీటర్ చొప్పున ముందుకు కదులుకుంది రోవర్. ఉపరితలంపై ఉన్న ఖనిజాల్ని ఇది అన్వేషిస్తుంది. నీటి జాడలతో పాటు, నీటి ప్రవాహం ఏమైనా ఉంటే కనిబెడుతుంది.

ఇలా సేకరించిన సమాచారాన్ని ల్యాండర్ కు చేరవేస్తుంది రోవర్. ల్యాండర్ నుంచి ఆ సమాచారం మొత్తం ఇస్రోకు చేరుతుంది. ప్రజ్ఞాన్ రోవర్ లో ఏర్పాటుచేసిన అత్యాధునిక పరికరాల కారణంగా.. ఈసారి చంద్రుడి నుంచి మరింత అమూల్యమైన సమాచారం భూమికి అందే అవకాశం ఉంది. ఇప్పటికే రోవర్ తన పని మొదలుపెట్టింది. చంద్రుడిపై ప్రతి క్షణం అమూల్యమైనదే.

14 రోజుల తర్వాత పరిస్థితేంటి..?

చీకటి, చలి, తుపాన్లు తట్టుకొని ల్యాండర్, రోవర్ తిరిగి ఛార్జ్ అవ్వడం చాలా కష్టతరమైన పని. 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యకాంతి వస్తుంది. కానీ అప్పటికి ల్యాండర్, రోవర్ లో ఎన్ని పరికరాలు పనిచేస్తాయి.. సిగ్నల్ అందుకునే సామర్థ్యం దానికి ఉంటుందా అనేది ప్రస్తుతానికి సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు.

14 రోజుల చీకటి, చలి తర్వాత కూడా ల్యాండర్, రోవర్ మళ్లీ యాక్టివేట్ అయితే.. ఇస్రో చరిత్రలో అదో చరిత్ర అవుతుంది. అయితే ఇవేవీ చంద్రయాన్-3 లక్ష్యాలు కావు. విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అవ్వడమే ఈ మిషన్ లక్ష్యం. అది మనం సాధించాం.