రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయబేధాలున్నాయనే ఊహాగానాలు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు వీళ్ల అనుబంధంపై కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వీళ్లిద్దరి మధ్య 'గ్యాప్' బయటపడింది.
జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ గెలుచుకున్నాడు బన్నీ. దీంతో చాలామంది ప్రముఖులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వాటికి బన్నీ ధన్యవాదాలు కూడా చెబుతున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పిన విధానం, దానికి బన్నీ ప్రతిస్పందించిన తీరు చర్చనీయాంశమైంది.
జాతీయ అవార్డులపై ట్వీట్ చేశాడు చరణ్. ఆర్ఆర్ఆర్ నుంచి మొదలుపెట్టాడు. ఆ సినిమాకు 6 అవార్డులు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ కు, బుచ్చిబాబుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కు, దేవిశ్రీప్రసాద్ కు కలిపి కామన్ గా కంగ్రాట్స్ చెప్పాడు. చివర్లో అలియాకు కూడా శుభాకాంక్షలు చెప్పి ముగించాడు.
ఇలా తన సందేశంలో బన్నీని గుంపులో గోవిందయ్యలా కలిపేశాడే తప్ప, ప్రత్యేకంగా అభినందించలేదు. దీనికి బన్నీ కూడా అంతే ముక్తసరిగా 'థ్యాంక్ యూ' అంటూ రిప్లయ్ ఇచ్చి ఊరుకున్నాడు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఆషామాషీ ఘనత కాదిది..
అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న అంశం సాధారణమైనది కాదు. ఏటా దేశవ్యాప్తంగా ఎవరో ఒకరికి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది, అలా ఈసారి అల్లు అర్జున్ కు వచ్చిందని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఇప్పటివరకు ఏఎన్నార్, చిరంజీవి లాంటి నటులు కూడా దక్కించుకోలేని అరుదైన ఘనతను బన్నీ అందుకున్నాడు.
కాబట్టి అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చాలామంది అదే పని చేశారు కూడా. చివరికి పవన్ కల్యాణ్ కూడా బన్నీ కోసం ప్రత్యేకంగా ఓ ట్వీట్ (జనసేన హ్యాండిల్ నుంచి) కేటాయించాడు. రామ్ చరణ్ మాత్రం ఈ పని చేయలేదు. అందుకే కొత్త లొల్లి మొదలైంది.
మూలం ఆర్ఆర్ఆర్ దగ్గర ఉంది..
నిజానికి ఈ వివాదం ఇక్కడ మొదలైంది కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచినప్పుడే ఇది స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకున్న సందర్భంగా బన్నీ పెట్టిన ట్వీట్ అప్పట్లో చిన్నపాటి దుమారం రేపింది. తన ఫ్యామిలీ హీరో చరణ్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని బన్నీ, అదే ట్వీట్ లో ఎన్టీఆర్ ను మాత్రం ఆశానికెత్తేశాడు.
ఇప్పుడు చరణ్ కు టైమ్ వచ్చింది. అందుకే రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ కు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా పోస్టు పెట్టాడని అంటున్నారు చాలామంది. ఈ హీరోల మనసులో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ మామూలుగా లేదు.
రెండుగా చీలిన మెగా అభిమానులు
ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. కొంతమంది బన్నీని దుమ్మెత్తిపోస్తుంటే, అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం చరణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. పవన్ పోస్టుకు స్పందించిన బన్నీ.. మీ నుంచి మెచ్చుకోలు రావడం నాకు చాలా స్పెషల్ అంటూ స్పందించాడు. ఇక మహేష్ బాబు పెట్టిన పోస్టుపై సుదీర్ఘంగా స్పందించాడు. చివరికి శ్రీవిష్ణుకు కూడా సవివరంగా ధన్యవాదాలు తెలిపాడు. కానీ రామ్ చరణ్ కు మాత్రం థ్యాంక్స్ అంటూ సరిపెట్టాడు.
ఇంకాస్త ప్రేమగా స్పందిస్తే తప్పేముందంటూ బన్నీపై చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా వివాదం ఏ మలుపు తీసుకుంటుందో..!