Advertisement

Advertisement


Home > Movies - Reviews

Bedurulanka 2012 Review: మూవీ రివ్యూ: బెదురులంక 2012

Bedurulanka 2012 Review: మూవీ రివ్యూ: బెదురులంక 2012

చిత్రం: బెదురులంక 2012
రేటింగ్: 2.25/5
తారాగణం: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, ఎల్బీ శ్రీరాం, గోపరాజు రమణ, జబర్దస్త్ రాంప్రసాద్, గెటప్ శ్రీను తదితరులు
కెమెరా: సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: మణి శర్మ
నిర్మాత: రవీంద్ర బెనెర్జీ ముప్పనేని
దర్శకత్వం: క్లాక్స్
విడుదల: 25 ఆగస్ట్ 2023

టైటిల్లో పేర్కొన్నట్టు ఇది 2012 నేపథ్యంలో సాగే కథ. ఆ ఏడు డిసెంబర్లో యుగాంతం అవుతుందని మీడియాలో వార్తలొస్తుండేవి. 2012 పేరుతో హాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. నిజానికి యావత్ ప్రపంచం ఆ వార్తని వినోదంగానే చూసింది తప్ప సీరియస్ గా పట్టించున్న వాళ్లెవరూ లేరు. 

కానీ ఒకవేళ చుట్టూ నది ఉన్న ఒక పల్లెటూరు ఆ వార్తని సీరియస్ గా తీసుకుని ఉంటే ఏమయ్యేదో అనే ఊహలోంచి తీసిన సందేశాత్మకహాస్య చిత్రం ఈ "బెదురులంక 2012". 

కథేంటంటే...2012లో గోదావరి ప్రాంతంలో బెదురులంక అనే ఊరు. ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) బావమరిది (అజయ్ ఘోష్) యుగాంతం హడావిడిని క్యాష్ చెసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా జనాన్ని భయపెట్టి మొసం చేయడానికి బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగర్), డెనియేల్ (రాం ప్రసాద్) లని వాడుకుంటాడు. ఈ ముగ్గురూ కలిసి ఊరి జనాన్ని ఎలా బోల్తా కొట్టిస్తారన్నది కథ. శివ (కార్తికేయ) ఈ మోసగాళ్ల మోసం బైట పెట్టే పనిలో ఉంటాడు. తన ప్రియురాలు చిత్ర (నేహా శెట్టి) ఊరి ప్రెసిడెంట్ కూతురు. మోసగాళ్లు ఎలా మోసం చేస్తారన్నది మొదటి భాగమైతే, ఆ మోసాన్ని హీరో ఎలా ఛేదిస్తాడు అనేది సెకండాఫ్. 

ఐడియా బానే ఉన్నా కథ పలచగా ఉండడం వల్ల కథనం నడపడంలో దర్శకుడు కష్టపడ్డాడు. 

రిపీటెడ్ సీన్స్ లాగ అనిపించడం (మరీ ముఖ్యంగా గెటప్ శ్రీను వచ్చినప్పుడల్లా ఈ ఫీలింగొస్తుంది), పాత్రల్ని మరీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం, ఏదో ఒకసారని కాకుండా పదే పదే బూతు ధ్వనించే డైలాగులు పెట్టడం, ఊరి జనం మొత్తాన్ని సామూహికంగా వెర్రిగొర్రెల్లా చూపించడం, క్లైమాక్స్ లో ముసుగు తీసి బతకమంటూ ఒక ముతక సందేశమివ్వడం...వెరసి ఇదొక మోస్తరు బి-గ్రేడ్ సినిమాగా అనిపిస్తుంది తప్ప మెచ్చుకోదగ్గ విధంగా అయితే ఉండదు. 

అయితే ఒక విషయం ఒప్పుకోవాలి. కథనంతా ఒకే సెట్టింగులో తీసినా ఆర్టిష్టులుగా సరైన వాళ్లని తీసుకుని దర్శకుడు మంచి పని చేసాడు. దానివల్ల చివరి వరకు భరించడం కుదిరింది. 

దర్శకత్వం విషయానికొస్తే...అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, జబర్దస్త్ రాంప్రసాద్ మీదున నడిచే ఒక సుదీర్ఘమైన ప్రారంభ సన్నివేశం అలనాటి దూరదర్శన్లో వచ్చే సీరియల్ సీనుని తలపిస్తుంది. అది చాలా క్రిస్ప్ గా, షార్ప్ డైలాగులతో ఉండాల్సిన ఓపెనింగ్ సీన్.

హీరో ఇంట్రడక్షన్ కూడా అడిగిన చిన్న ప్రశ్నకి అవసరం లేకపోయినా చెప్పే పొడవాటి డైలాగుతో ఉంటుంది.

చాలా సేపు విసిగించినా నెమ్మదిగా ఆ యాంబియన్స్ కి అలవాటు పడ్డాక హ్యూమర్ కొంచెం కొంచెం వర్కౌట్ అవుతూ ఉంటుంది. 

ఈ చిత్రం థియేటర్ వాచింగ్ కంటే ఓటీటీల్లో బాగుండే అవకాశముంది. ఎందుకంటే అక్కర్లేని పాటల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునే పరిస్థితి థియేటర్లో ఉండదు కనుక. ఒకటి రెండు పాటలు బాగున్నాయి. మిగతావి చిరాకు పెట్టిస్తాయి. అవసరం లేని పాటలు ఈ సినిమాకి ఒక మైనస్. పాటల్లో మణిశర్మ సంగీతం బాగున్నా నేపథ్య సంగీతం వీక్ గా ఉంది.

నిజానికి ఇందులో చూపించినట్టు మతం పేరుతో, జోతిష్యం పేరుతో జనాల్ని మోసం చేసేవాళ్లు చాలా చోట్ల ఉంటుంటారు. ఆ అంశాన్ని మాత్రం ఏ మాత్రం "బెదురు" లేకుండా స్పృశించాడు దర్శకుడు. ఒక దొంగ హిందూ జ్యోతిష్యుడిని, ఫ్రాడ్ క్రైస్తవ ఫాదర్ ని పెట్టి కామెడీ నడిపాడు.   

కార్తికేయ పేరుకి హీరోయే అయినా అజయ్ ఘోష్, జబర్దస్త్ రాం ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగర్, రాజ్ కుమార్ కసిరెడ్డిలే ప్రధానంగా కనిపిస్తారు. 

కార్తికేయ చూపించిన హీరోయిజమంటూ ఏమీ లేదు...బల్లెం విసరడం, హీరోయిన్ ని లవ్ చేయడం, సత్య-వెన్నెల కిషోర్ లతో ఒక డ్రామా చేయడం తప్ప. 

హీరోయిన్ గా నేహా శెట్టి పాత్ర గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. చాలా రెగ్యులర్ పాత్ర తనది. 

ఊరి ప్రెసిడెంటుగా గోపరాజు రమణ ఓకే. కథ క్లైమాక్సులో రాజ్ కుమార్ కసిరెడ్డికి స్కోప్ లభించింది. 

సత్య, వెన్నెల కిషోర్ లది క్లైమాక్స్ కి పరిమితమయ్యే గెష్ట్ రోల్స్. 

ఎల్బీ శ్రీరాం పాత్ర మాత్రం ఎందుకుందో అర్ధం కాదు. సినిమా మొత్తం ఏదో జ్ఞానిలా కనిపించి చివరికొచ్చేసరికి ముసుగు తీసి తోచినట్టు బతకమని సందేశమిస్తాడు. అతని పిలుపునందుకుని ఊరి జనమంతా మర్నాటికల్లా చచ్చిపోతున్నామని నమ్మి ఆనందోత్సాహాలతో "కొట్రా డప్పు -వెయ్యరా స్టెప్పు" అంటూ కల్లు తాగుతూ డ్యాన్స్ చేస్తారు. అందులో అప్పటి వరకు డీసెంటుగా ఉన్న కొన్ని పాత్రలు కూడా వెకిలిగా స్టెప్పులేస్తాయి. ఇందులో లాజిక్ వెతక్కుండా ఇదొకరకం కామెడీ అనుకుని చూసెయ్యాలంతే. 

ఓవరాల్ గా కథనం నడపడంలో కన్సిస్టెన్సీ లోపాలు చాలా ఉన్నాయి. సంభాషణలు ఒకటి రెండు చోట్ల పేలాయి. అదే టైమింగ్, శ్రద్ధ మొత్తం డైలాగ్స్ మీద కూడా పెట్టుంటే ఇలా అప్ అండ్ డౌన్ గ్రాఫుతో కాకుండా నాన్ స్టాప్ కామెడీగా మారుండేది. 

ఈ దర్శకుడికి స్పార్క్ ఉంది. కానీ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాను ఎక్కడ వీక్ గా ఉన్నాడో తెలుసుకుని ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తపడితే మలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకునే అవకాశముంది. 

బాటం లైన్: బెదరలేదు

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా