నారా లోకేష్ మీద విశాఖ జిల్లా పెందుర్తిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఎవరికి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉంటాయో వారికే పార్టీ పదవులు ఇస్తామంటూ గన్నవరం సభలో లోకేష్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ మీద వైసీపీ సోషల్ మీడియా వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజకీయాలు అంటే సేవాభావంతో ఉండాలని, పవిత్రమైన బాధ్యతగా వాటిని స్వీకరించాలని వైసీపీ నేతలు అంటున్నారు. అలాంటిది లోకేష్ కేసులు ఎక్కువ ఉన్న వారికి టికెట్లు అని చెప్పడం, వారికే పదవులు అని ప్రకటించడం ద్వారా ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అని వారు ప్రశ్నించారు.
మంత్రిగా పనిచేసిన లోకేష్ ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా రెచ్చగొట్టే వైఖరికి పాల్పడుతున్నారని వారు అంటున్నారు. ఇలా బహిరంగంగానే క్యాడర్ ని రెచ్చగొడుతూ వస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ మీద చర్యలు తీసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్ కోరాడ చందు ఫిర్యాదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా ఇదే తీరున కార్యకర్తలని రెచ్చగొడుతున్నారని, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులు ఎక్కువ ఉన్న వారికే పదవులు అని చెబుతున్న నారా లోకేష్ మీదనే ఇపుడు కేసులు ఎక్కువగా పడుతున్నాయని ఆయన ధోరణి మార్చుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు.