ఎలాగూ వివాహాలు అనేవి ఇప్పుడు కాస్త లేటు వయసులో చేసుకునేవి అయ్యాయి. గతంలో లేట్ మ్యారేజెస్ అనుకున్నవి ఇప్పుడు అర్లీ అనబడుతున్నాయి! పాతికేళ్ల వయసులోపు పెళ్లి గురించి ఆలోచించే వారు లేరిప్పుడు.
ఇరవై యేళ్ల కిందట వరకూ.. కొన్ని ప్రాంతాల్లో ఇరవై వచ్చే సరికి పెళ్లి అయిపోవాలన్నట్టుగా ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రాంతాలు, రాష్ట్రాలు సంబంధం లేకుండా.. పెళ్లి అంటే పాతికేళ్లు, ఆ పైన ఆలోచించే వ్యవహారంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఇప్పుడు 28 యేళ్ల వయసు ఆ పైన జరుగుతున్నాయి.
18 నిండగానే పెళ్లి.. అనేది పోయి, 28 యేళ్ల వయసులో పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా అది ఆలోచనే! ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి అవుతుందనేది అంత తేలికగా తేలే అంశం ఏమీ కాదు. ఇక అబ్బాయిల పరిస్థితీ అంతే. ఎవరైనా పెళ్లికి తొందరపడినా.. అంత తేలికగా పెళ్లి అయ్యే పరిస్థితి లేదు. కోరకున్న ఫీచర్లతో ఉన్న పిల్ల దొరకడం చాలా దుర్లభంగా మారింది. ఈ నేపథ్యంలో సొసైటీలో లేట్ మ్యారేజెస్ కామన్ అయ్యాయి.
మరి ఒకప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే.. పాతికేళ్ల వయసు తర్వాత పెళ్లి అనేది సొసైటీ ఆమోదించేది కాదు. ఇప్పుడు ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో.. లేటు వయసు లో పెళ్లి చేసుకోవడంలో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.
పెళ్లి లేట్ అయిపోతోందని బెంగ పెట్టుకోకుండా.. సింగిల్ గా ఉన్నప్పుడు చేయగల పనులన్నింటినీ చేసుకోవచ్చని.. ఇదే లేటుగా పెళ్లి చేసుకోవడంలో ఉన్న లాభం అని వారు చెబుతున్నారు.
పర్సనల్ గ్రోత్!
ఉద్యోగపరంగా కావొచ్చు, ఆర్థికంగా కావొచ్చు.. పెళ్లికి ముందే మంచి ఉన్నతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించగలరు సింగిల్ గా ఉన్న వారు. పెళ్లి అయితే పార్టనర్ కు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగపరంగా ముందులా పని చేయలేకపోవచ్చు. దీని ప్రభావం కెరీర్ పై పడవచ్చు. అందుకే లేట్ గా మ్యారేజ్ అయ్యే పరిస్థితి ఉంటే.. ఈ సమయాన్ని కెరీర్ మీద ఫోకస్ చేయడానికి కేటాయించుకోవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా పెళ్లి అదనపు భారం. బ్యాచిలర్ గా రూమ్ షేర్ చేసుకోవచ్చు, పీజీల్లో గడపొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే.. మొదటి నెల నుంచినే రెంట్ మీద పడుతంది. ఇలా మొదలుపెడితే ఖర్చుల జాబితా పెద్దది. మ్యారేజ్ లేట్ అవుతుంటే.. ఆ డబ్బులు సేవ్ అవుతున్నాయని అనుకుంటే.. లేట్ కావడంలో కూడా కొంత లాభం ఉందనుకోవచ్చు!
గోల్స్ రీచ్ కావడం!
అది ప్రొఫెషనల్ గా అయినా, వ్యక్తిగత ఆనందం కోసం పెట్టుకున్న గోల్స్ విషయంలో అయినా.. పెళ్లి కాకుండానే గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. పెళ్లి అయితే ఆటంకాలు ఏర్పడే అవకాశాలుంటాయి, కాబట్టి వివాహం లేట్ అవుతూ ఉంటే.. ఇలాంటి గోల్స్ ను రీచ్ కావడానికి పుష్కలమైన సమయం దొరికినట్టే! గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఫైనాన్షియల్ గా సెటిల్ కావాలని, పర్సనల్ గోల్స్ రీచ్ కావాలని కొందరు వివాహాన్నే వాయిదా వేసుకుంటూ ఉంటారు. వివాహం లేటవుతున్న వారు కూడా.. ఇలాంటి గ్రోత్ అండ్ గోల్స్ మీద దృష్టి సారిస్తే ఉపయోగం ఉంటుంది.
మానసిక పరిణతి!
ఇరవై ఐదేళ్లకు కాస్త అటూ ఇటూ వయసులో పెళ్లి చేసుకున్న వారికి, ముప్పై తర్వాత పెళ్లి చేసుకున్న వారికి కూడా పార్ట్ నర్ తో వ్యవహరించే విషయంలో తేడాలుంటాయి. మానసికంగా పూర్తి స్థాయిలో పరిణతి సాధించలేకపోవడమే ఈ తేడా. ముప్పై దాటిన వారు చాలా పరిణతి సాధించగలరు. అయితే ఇది అందరి విషయంలో కాకపోవచ్చు. కొందరికి ముప్పై ఐదు వచ్చినా పిల్ల చేష్టలు, పిల్ల మనస్తత్వం పోకపోవచ్చు. అయితే పరిణతి సాధించగలవారిలో మాత్రం ఇరవై ఏడేళ్ల వయసుకు, ముప్పై రెండుకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పరిణతితో వారు సంసారాన్ని సులువుగా ఈదగలరు!
విడాకుల రేటు కూడా తగ్గుతుంది!
లేట్ మ్యారేజెస్ వల్ల విడాకుల అవకాశాలు కూడా తగ్గుతాయని పరిశీనలు చెబుతున్నాయి. చిన్న వయసులో..అంటే పాతికేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న వారు వివాహం తర్వాత గట్టిగా తగవులాడి.. విడిపోయే అవకాశాలతో పోలిస్తే.. ముప్పై దాటిన వారిలో ఇలాంటి వ్యవహారాల శాతం కాస్త తక్కువే ఉంటుంది.
మార్పుకు తట్టుకోవడం!
వివాహానికి పూర్వపు జీవితం, వివాహం తర్వాతి జీవితానికి చాలా తేడా ఉంటుంది. ప్రత్యేకించి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వారికి ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఈమార్పుకు తట్టుకోవడం అంత తేలిక కాదు. అప్పటి వరకూ తమకోసం తప్ప ఎవరి కోసం బతకని వారు.. ఒక్కసారిగా పెళ్లితో చాలా మలుపులు చూడాల్సి ఉంటుంది. ఆ మలుపులను తట్టుకోవాలంటే.. వయసు కాస్త ఎక్కువ ఉంటే మాననసికంగా ఆ మార్పుకు తట్టుకోవడం ఈజీగా ఉండవచ్చు.