ప్రతి విషయంలో స్మార్ట్ అనే పదం వాడకం కామన్ అయిపోయింది. ప్రతి సిటీ తనకుతాను స్మార్ట్ సిటీ అని ప్రకటించుకుంటోంది. ఇంతకీ అసలైన స్మార్ట్ సిటీ ఏది? దీనిపై కేంద్రం సర్వే నిర్వహించింది. కొన్ని పారామీటర్స్ పెట్టి నగరాల నుంచి నామినేషన్లు స్వీకరించింది.
అలా దేశవ్యాప్తంగా ఉన్న 80 నగరాల నుంచి వివిధ విభాగాల్లో 845 నామినేషన్లు వచ్చాయి. వీటిని ఐదు దశల్లో ఫిల్టర్ చేసి, బెస్ట్ స్మార్ట్ సిటీ ఏదనే విషయాన్ని నిగ్గుతేల్చింది కేంద్ర గృహ-పట్టణాభివృద్ధి శాఖ.
రవాణా, ఇంధనం, నీటి నిర్వహణ, మురుగు నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, బహిరంగ స్థలాలు-పార్కుల సుందరీకరణ, మౌళిక వసతులు, స్మార్ట్ పరిపాలన, టెక్నాలజీ వినియోగం లాంటి వివిధ విభాగాల్లో ఈ నామినేషన్లను స్వీకరించి, అందులోంచి జాతీయ ఉత్తమ స్మార్ట్ సిటీని ఎంపిక చేసింది.
2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ స్మార్ట్ సిటీగా ఇండోర్ కు దక్కింది. ఇక నేషనల్ స్మార్ట్ సిటీ విభాగంలో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో.. చాలా అంశాల్లో ఇండోర్ నగరం మెరుగ్గా ఉందని కేంద్రం ప్రకటించింది.
ఇక ఇదే విభాగంలో స్టేట్ అవార్డ్స్ కూడా ప్రకటించారు. స్మార్ట్ సిటీ అవార్డుల పోటీలో భాగంగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ నిలవగా, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్, నాలుగో స్థానంలో ఉత్తర ప్రదేశ్ నిలిచాయి.
వీటితో పాటు వివిధ విభాగాల్లో విడివిడిగా కూడా అవార్డులు ప్రకటించింది కేంద్రం. వాటర్ మేనేజ్ మెంట్ లో ఇండోర్, రవాణా విషయంలో ఛండీగడ్, సాంస్కృతిక అంశాల్లో అహ్మదాబాద్, రోడ్ల విస్తరణ, చెరువుల ఆధునీకరణలో కోయంబత్తూర్ మొదటి స్థానాల్లో నిలిచాయి.
ఈ అవార్డుల్ని రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల అధికారులకు అందించబోతున్నారు. జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పేర్లు ఎక్కడా కనిపించలేదు.