ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి పచ్చ మీడియా ప్రతినిత్యం ఎగబడుతూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ అధికార వికేంద్రీకరణ చేపట్టాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు.
అయితే దీని ద్వారా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది అన్నట్లుగా ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో తమ తమ సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన సుమారు 47 సంస్థలలో ఒక్కటి మినహా ఎవరు అక్కడ పనులు చేయడం లేదని దీని వలన అభివృద్ధి మొత్తం స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈనాటి దినపత్రిక ఒక సుదీర్ఘమైన కథనాన్ని ప్రచురించింది. అయితే అర్థసత్యాలతో అపోహలతో వండిన ఈ కథనం ద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచడమే లక్ష్యంగా ప్రచురించినట్టు అర్థం అవుతుంది.
చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థలకు అడ్డగోలుగా భూపందెం చేపట్టారు. విచ్చలవిడిగా దోచి పెట్టారు. కొన్ని యూనివర్సిటీలకు వారికి మరే ఇతరక్యాంపస్ లోనూ లేనివిధంగా రెండేసి వందల ఎకరాలను అప్పనంగా దోచిపెట్టారు. కొన్ని సంస్థలు ఏర్పాటు అయ్యాయి కూడా. అయితే భూములు తీసుకున్న 47 సంస్థల్లో ఎన్ఐడీ మినహా మరెవ్వరూ పనులు చేయడం లేదని ఈనాడు విలపిస్తోంది. దీనివల్ల అమరావతి ప్రాంతానికి రాదు, ఆయా సంస్థలు రాకపోవడం వలన రాష్ట్రానికే నష్టం జరుగుతున్నదని, ఇది జగన్ చేసిన ద్రోహం అని ఆక్రోశిస్తున్నది.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు అనేకం ఈ జాబితాలో ఉన్నట్టుగా పేర్లు ఏకరవు పెట్టారు. ఆ సంస్థలు.. తాము తీసుకున్న స్థలాల్లో తాము పనులు చేసుకుంటూ పోవడానికి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏమిటి సంబంధం? వారి పనులు వారు చేసుకోవచ్చు కదా? అనే సందేహం పలువురికి కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేస్తాను అని ప్రకటించడం వలన.. కేవలం సెక్రటేరియేట్, ముఖ్యమంత్రి, గవర్నరుల నివాసాలు మాత్రమే అక్కడకు తరలివెళ్తాయి. సదరు సెక్రటేరియేట్ తో ఈ సంస్థలకు ఏమిటి పని? సెక్రటేరియేట్ పొరుగునే ఉండాల్సిన అవసరం వీరికి లేదు కదా..! వీరంతట వీరు పనులు చేసుకుని తమ సంస్థలను ఏర్పాటుచేసి ఉంటే గనుక.. ఖచ్చితంగా ఇక్కడ మంచి నగరమే డెవలప్ అవుతుంది కదా.. అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ప్రభుత్వ పరంగా ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ మాత్రమే సమకూర్చాలి.
సంస్థలు తమ తమ కార్యాలయాలను ఏర్పాటుచేస్తూ ఉంటే.. ఆటోమేటిగ్గా ప్రభుత్వం మౌలికవసతుల పనులు చేస్తుంది. చేయకపోతే అప్పుడు నిందించవచ్చు. అంతే తప్ప.. స్థలాలు పుచ్చుకున్న సంస్థలు పనులు చేయకుండా నాటకాలు ఆడుతూ ఉంటే.. జగన్ సర్కారును నిందించడం ఎందుకు? ఆ సంస్థలతో చంద్రబాబు ఏ లోపాయికారీ ఒప్పందాలతో వారికి భూములు పంచారో.. ఎందువల్ల వారు మిన్నకున్నారో ఎవరికి తెలుసు? అని ప్రజలు అనుకుంటున్నారు.
సెక్రటేరియేట్ ఉన్న చోటనే అందరూ ఉండాలని ఎందుకు అనుకోవాలి. అలాంటి మాటలు చెప్పడమే ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబునాయుడు ప్రదర్శించిన చాతుర్యం. ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలు ఇవి. ఆ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటుచేసుకుంటే జగన్ అడ్డుకోలేదని గుర్తించాలి.