‘సత్తా’ చూపించేస్తున్నారు

నిర్మాతలకు ఎక్కడో చిన్న ఆశ వుంటుంది. ఓ మంచి సినిమా తీసి పెడతాడేమో? ఓ రూపాయి లాభం చేసుకోవచ్చేమో అని. ముందుగానే వాతావరణ హెచ్చరిక మాదిరిగా చెప్పేవాళ్లు చెబుతూనే వుంటారు. అటు పక్కకు వెళ్లొద్దని.…

నిర్మాతలకు ఎక్కడో చిన్న ఆశ వుంటుంది. ఓ మంచి సినిమా తీసి పెడతాడేమో? ఓ రూపాయి లాభం చేసుకోవచ్చేమో అని. ముందుగానే వాతావరణ హెచ్చరిక మాదిరిగా చెప్పేవాళ్లు చెబుతూనే వుంటారు. అటు పక్కకు వెళ్లొద్దని. కానీ ఎక్కడో చిన్న ఆశ అటే లాగేస్తుంది. కానీ ఫలితం మారదు. నిర్మాత కుదేలైపోతాడు.

ఏజెంట్ సినిమా ఆరంభంలో నిర్మాత అనిల్ సుంకరకు చెప్పేవాళ్లు చెప్పారు. నలభై కోట్ల వ్యయం. అఖిల్ మీద వర్కవుట్ అవుతుందా? వర్కవుట్ అయ్యే ప్రాజెక్టు అయితే దాన్ని ప్లాన్ చేసిన మరో పెద్ద సంస్థ, దర్శకుడు సురేందర్‌కు ఆప్తుడైన నిర్మాత ఎందుకు వదులుకుంటారు అని. రెమ్యూనిరేషన్ లేదు.. లాభాల్లో వాటానే దర్శకుడికి అందువల్ల వర్కవుట్ అవుతుందని ఆశపడ్డారు నిర్మాత. ఏమైంది. 40 కోట్లు కాస్తా 80 కోట్లు అయింది. లాభాల్లో వాటా వద్దు అని రెమ్యూనిరేషన్ తీసుకున్నారు. నిర్మాతకు 20 కోట్లు నికర నష్టం.

మళ్లీ భోళాశంకర్. దర్శకుడు మెహర్ రమేష్. ట్రాక్ రికార్డ్ తెలిసిందే. కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి చెబుతూనే వున్నారు. కానీ తప్పేదేముంది. మెగాస్టార్ డేట్‌లు వచ్చాయి. ఆ మాత్రం డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నారు. దారుణంగా డిజాస్టర్ అయింది. బయ్యర్లు కుదేలయిపోయారు. నిలువునా మునిగిపోయారు. నిర్మాత కూడా డిటో.. డిటో.. ఇక ఇప్పట్లో మళ్లీ కోలుకోవాలంటే కనీసం ఓ యాభై కోట్లు ఈ బాధలు తీరడానికే పెట్టుబడి పెట్టాలి.

గాండీవధారి అర్జున… అప్పటికే ఘోస్ట్ నిర్మాణంలో వుంది. ఆ స్క్రిప్ట్ వ్యవహారాలు వినిపిస్తూనే వున్నాయి. స్క్రిప్ట్ బాలేదని రైటర్ ను రప్పించి, చేసిన షూట్ పక్కన పెట్టి రీరైట్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇక అంతకన్నా రూపాయి పెట్టేది లేదని నిర్మాత కరాఖండీగా దర్శకుడికి చెప్పేసారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి.  కానీ భోగవిల్లి బాపినీడు ‘దొరికేసారు’.

సినిమాను 54 రోజుల్లో తీసేసానని చెబుతున్న దర్శకుడు లొకేషన్ల రెక్కీకే 20 రోజులు తిరిగిన సంగతి, దానికి అయిన వ్యయం సంగతి మాట్లాడారు కదా. కోవిడ్ పుణ్యమా అని మూడు ఏళ్లపాటు సినిమా నిర్మాణంలో వున్న సంగతేమిటి?  ఈ మూడేళ్లు సినిమా మీద, సినిమా జనాల మీద పెట్టిన ఖర్చు ఎంత? వడ్డీలు ఎంత?

సరే, సినిమా నిర్మాణంలో వుండగా, నిర్మాత ఇదేంటీ.. అదేంటీ అని అడిగితే, అది హాలీవుడ్ స్టయిల్ స్క్రీన్ ప్లే అలాగే వుంటుంది అని సమాధానం ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాల టాక్. మొత్తానికి సినిమా పూర్తయింది. దర్శకుడు చెబుతున్న 35 కోట్లో, నిర్మాత ఆఫ్ ది రికార్డు గా చెబుతున్న 55 కోట్లో ఖర్చయ్యాయి.

కానీ ఇది కాదు సమస్య. ఓపెనింగ్ ఎందుకు తెగలేదు. నిర్మాణ సంస్థ లోపం లేదు. అంతకు ముందు విరూపాక్ష పెద్ద హిట్. దాని ప్రభావంతో మంచి ఓపెనింగ్ రావాలి కదా. అంటే దర్శకుడి మీద నిర్మాతకు వున్న నమ్మకం జనాలకు లేదు. బాగా వుందని టాక్ వస్తే వెళ్దాంలే అని పక్కన పెట్టారు సినిమాను. బయ్యర్లకు కూడా నమ్మకం సడలింది.

రెండు పెద్ద ఏరియాలకు ముందు నాలుగు కోట్లు తరువాత 2.60 కోట్లు అన్న బయ్యర్ ఆఖరికి కోటి నలభై లక్షలు కట్టారు. ఓ అబౌవ్ మీడియం సినిమాకు, అది కూడా రెండు పెద్ద ఏరియాలకు కలిపి కోటి నలభై లక్షలు కట్టడం అంటే ఏమనుకోవాలి.

మరో పెద్ద ఏరియాకు అయితే తామేమీ కట్టం.. కావాలంటే విడుదల చేస్తాం అని మొండికేసారు. ఇంకో చిన్న ఏరియాకు 70 లక్షల రేంజ్ అనుకున్నది ముఫై నుంచి ముఫై అయిదు లక్షలరేంజ్‌లో కట్టారు.

దీంతో నిర్మాతకు శాటిలైట్ కాలేదు. థియేటర్ నుంచి పెద్దగా రాలేదు. ఇప్పుడు తీరా చూస్తే సినిమా డిజాస్టర్. దానా దీనా ఓ ఇరవై కోట్ల మేరకు అవుట్.

ఇలా దర్శకులు కబుర్లు చెప్పి, నిర్మాతలను ఒప్పించి సినిమాలు తీసి, తమ పారితోషికం జేబులో వేసుకుని చక్కా పోతున్నారు. నిర్మాతలు కుదేలైపోతున్నారు. కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ మరో నిర్మాత ఎవరో ఒకరు ఈ మాటల వలలో పడతారు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే వుంటుంది.