రాబోతున్న పెద్ద సినిమా ఖుషీ.. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. మంచి బజ్ వుంది. మాంచి ఓపెనింగ్ తీసుకుంటుంది. అందులో సందేహం లేదు. కానీ ఇది కాదు పాయింట్.. సినిమా మంచి హిట్ కావాలి. థియేటర్లు కళ కళ లాడాలి. ఎగ్జిబిటర్లు తేరుకోవాల్సి వుంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు రావణాసుర, ఏజెంట్, రామబాణం, కస్టడీ, స్పై, ఆదిపురుష్, రంగబలి, బ్రో, భోళాశంకర్ .. ఇంకా చిన్న, మిడ్ సినిమాలు అనేకం బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి. ఆ సినిమాలు కొన్నవాళ్లు కుదేలయ్యారా? వెనక్కు నిర్మాత ఏమన్నా ఇస్తారా? అన్నది పక్కన పెడితే. ఆ సినిమాలు కొన్నది వేరు వేరు బయ్యర్లు కావచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్ లో పెట్టుబడులు పెట్టింది ఎగ్జిబిటర్లు. అంటే థియేటర్లు నడిపేవాళ్లు.
బయ్యర్లు అడిగినపుడల్లా అడ్వాన్స్ లు పంపారు. బయ్యర్లకు లాభ నష్టాలు వుంటాయి కానీ ఎగ్జిబిటర్లకు కాదు. రన్నింగ్ అక్కౌంట్ లా ఎగ్జిబిటర్ల డబ్బులు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అలా వుంటాయి. లెక్కలు చూసుకుంటూ వుంటారు. ఎప్పడయితే ఎగ్జిబిటర్ల డబ్బులు వాళ్ల దగ్గర తరిగిపోయి, బయ్యర్ల దగ్గర పేరుకుపోతున్నాయో, అప్పుడు వస్తుంది సమస్య. తరువాత వచ్చే సినిమాలకు అడ్వాన్స్ లు రావు. అడ్వాన్స్ లు రాకపోతే, బయ్యర్లు నిర్మాలతకు డబ్బులు కట్టలేరు.
అది తరువాత సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నిన్నటికి నిన్న గాండీవధారి సినిమాకు వచ్చిన సమస్య అదే. ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ లు ఇవ్వలేమన్నారు. దాంతో బయ్యర్లు చేతులెత్తేసారు. తోచిందికట్టారు. ఇప్పుడు కాస్త బజ్ వుంది కనుక బయ్యర్లు అప్పో..సొప్పో చేసి కొంత కడతారు. ఎగ్జిబిటర్లు కూడా కొంత వరకు ఇస్తారు.
ఖుషీ తేడా కొట్టదు. ఆ నమ్మకం వుంది. కానీ దురదృష్టం వెంటాడితే.. ఇక ఆ తరువాత వచ్చే సినిమాలు అన్నింటకీ కష్టమే. భోళా సినిమాకు ఒక్క నైజాంలో ఏడెనిమిది కోట్ల థియేటర్ల డబ్బు ఆగిపోయింది. ఇలా రాను రాను ఒక్కో సినిమా బకెట్ తన్నేస్తూ పోతే రాబోయే చిన్న, మీడియం సినిమాలు ఇక అమ్ముకోలేరు. అమ్ముకున్నా థియేటర్ల దగ్గర నుంచి అడ్వాన్స్ లు రావు. కాస్త పెద్ద సినిమాలే ఈ సమస్య నుంచి గట్టెక్కుతాయి.
కానీ పెద్ద సినిమాలు ఎన్ని వుంటాయి. చిన్న.. మీడియం సినిమాలే ఎక్కువ. ఇప్పుడు అవి ఎటువంటి గండం లేకుండా విడుదల కావాలంటె ఈ పెద్ద సినిమాలు హిట్ కావాల్సింది. ఈ లైన్ లో ముందు వస్తున్నది ఖుషీ నే. అందుకే హిట్ కొట్టి తీరాల్సిందే.