బిగ్ బాస్ విజేత, గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాడా? తనకున్న పాపులారిటీతో ఈయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాడా? కాంగ్రెస్ పార్టీ నుంచి అతడికి ఎమ్మెల్యే టికెట్ రాబోతోందా? దీనికి కొనసాగింపుగా 24 గంటల నుంచి మరో ఊహాగానం మొదలైంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ సీట్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి, రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా ఈ విషయాన్ని ప్రసారం చేశాయి. దాదాపు వెయ్యికి పైగా అందిన అప్లికేషన్లలో రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా ఉన్నట్టు ప్రచారం మొదలైంది.
తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఈ సింగర్ ఖండించాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించాడు.
“గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నట్టు నాపై ప్రచారం జరుగుతోంది. నేను రాజకీయాల్లో లేను. ఇది ఫేక్ న్యూస్. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను రాజకీయాల్లోకి రాను.”
ఇలా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. అన్ని పార్టీలకు చెందిన అందరు రాజకీయ నాయకుల్ని తను గౌరవిస్తానని, తను కేవలం నడుడిగా, గాయకుడిగా వినోదాన్ని పంచడంపై మాత్రమే ఆసక్తిని కలిగి ఉన్నానని స్పష్టం చేశాడు.
రాజకీయాల్లోకి రావాల్సిందిగా తనను ఎవరూ సంప్రదించలేదని, తను కూడా ఎవ్వర్నీ కలవలేదని ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ ఇచ్చాడు. తను కేవలం వినోద రంగంలో మాత్రమే కొనసాగుతానని అంటున్నాడు.