పాపం.. తుమ్మలకు వేరే గతిలేదు మరి!

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం మూలాలను, భావజాలాన్ని, బలాన్ని పుష్కలంగా కలిగి ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు పాపం ఇప్పుడు గత్యంతరం లేకుండా పోయింది.  Advertisement తాను గత ఎన్నికల్లో పోటీచేసి…

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం మూలాలను, భావజాలాన్ని, బలాన్ని పుష్కలంగా కలిగి ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు పాపం ఇప్పుడు గత్యంతరం లేకుండా పోయింది. 

తాను గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పాలేరు నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ పచ్చజెండా ఊపలేదు. గతంలో తుమ్మలను ఓడించిన అప్పటి కాంగ్రెస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి.. తర్వాత భారాసలో చేరి ఇప్పుడు అభ్యర్థిత్వం కూడా దక్కించుకున్నారు. కొన్నాళ్లు సైలెంట్ అయి.. ఏడాదిగా రాకీయంగా పావులు కదుపుతున్న తుమ్మల, ఇప్పుడు అలక వహించి, పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా సరే.. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను మళ్లీ పాలేరునుంచే పోటీచేస్తానని తెగేసి చెప్పేశారు. అయితే పార్టీ ఏది అనే సీక్రెట్ మాత్రం ముడివిప్పలేదు.

అయితే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో కార్యకర్తల సమావేశం కోసం నిర్వహించిన భారీ ర్యాలీ మాత్రం.. ఆయన భవిష్యత్ ప్రస్థానం గురించి.. చిన్న సంకేతాలు ఇచ్చేసింది. ఆయన ర్యాలీలో గులాబీ వాసన లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. కేవలం తుమ్మల ఫోటోలు ముద్రించి, జై తుమ్మల అని రాసిన జెండాలను పట్టుకుని అనుచరులు, కార్యకర్తలు ఊరేగారు. అయితే.. వారు తమ అత్యుత్సాహాన్ని దాచుకోకుండా.. జై తుమ్మల జెండాతో పాటూ హస్తం గుర్తు కూడా ఉన్న ఒక పెద్ద కాంగ్రెస్ జెండా ను కూడా ప్రదర్శిస్తూ ర్యాలీలో సాగడంతో తుమ్మలు అడుగులు ఎటువైపు పడబోతున్నాయో కాస్త క్లారిటీ వచ్చింది.

పాపం.. తెలుగుదేశం భావాలకు ప్రతినిధి అయిన తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెసులో చేరడం తప్ప ఇప్పుడు వేరే గత్యంతరం లేదనే చెప్పాలి. ప్రస్తుతం భారాస తృణీకరించిన వారికి ఉన్నవి రెండే దార్లు. ఒకటి- కాంగ్రెస్, రెండు- భాజపా. అయితే కమ్యూనిస్టులకు ప్రతినియోజకవర్గంలో కొంత పట్టు ఉండే ఖమ్మం జిల్లాలో భాజపాకు కనీసమైన ఠికానా కూడా లేదన్నది స్పష్టం. ఆ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఈటల రాజేందరే స్వయంగా గతంలో ప్రకటించారు. అలాంటిది బిజెపిలో చేరితో ఆత్మహత్యతో సమానం అని తుమ్మలకు తెలుసు. అందుకే ఆయన కాంగ్రెసు పార్టీ మీద ఆశతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

కాంగ్రెసు పార్టీ తాము ఈసారి టికెట్లు చాలా శాస్త్రీయంగా ఇవ్వబోతున్నాం అని కలర్ ఇచ్చేలాగా.. దరఖాస్తులను ఫీజుతో సహా స్వీకరించి.. నిన్నటితో ఆ పర్వం ముగించింది. అయినా.. తుమ్మల వంటి నాయకులు వచ్చేట్లయితే వారికి అవకాశం ఇవ్వడానికి కొన్ని అతిక్రమణలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 

తెలుగుదేశం కూడా ఎన్నికల్లో పోటీచేయాలని ఉబలాటపడుతున్నది గానీ.. తుమ్మల అంత సాహసం చేయలేకపోవచ్చు. అందుకే ఆయనకు కాంగ్రెస్ తప్ప వేరే గతిలేదని, పార్టీ పేరు ఆయన ప్రస్తుతానికి ప్రకటించకపోయినా ప్రజలకు అర్థమవుతున్నదని అందరూ అనుకుంటున్నారు.