అలా చేసి.. ఏం సాధించాలనుకున్నారో కేసీఆర్!

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏయే అంశాలను ప్రస్తావించాలో.. తమ రాష్ట్రాలకు సంబంధించి ఏమేం సాధించడానికి ప్రయత్నించాలో పోరాడాలో పార్టీ అధినేతలు దిశానిర్దేశం చేయడం చాలా సహజం.…

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏయే అంశాలను ప్రస్తావించాలో.. తమ రాష్ట్రాలకు సంబంధించి ఏమేం సాధించడానికి ప్రయత్నించాలో పోరాడాలో పార్టీ అధినేతలు దిశానిర్దేశం చేయడం చాలా సహజం. అలాంటి భేటీని గులాబీ బాస్ కేసీఆర్ కూడా నిర్వహించారు. కేంద్రంపై ఎటూ స్పష్టమైన పోరాటంతో రెచ్చిపోతున్న కేసీఆర్.. ఎంపీలకు కూడా అదే విషయం నూరిపోశారు. ఆయన చెప్పిన ఎజెండాలో.. కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఎండగట్టాలనే అంశం కూడా సహజంగా ఉంది. ఎమ్మెల్యేలకు ఎర అంశాన్ని కూడా లేవనెత్తాలనే సూచన కూడా ఉంది. ట్విస్టు ఏంటంటే.. సమావేశాలను బహిష్కరించడానికి వెనుకాడవద్దంటూ ఆయన దిశానిర్దేశం చేయడం!

పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించడం అనేది తీవ్రమైన నిర్ణయం. పార్లమెంటులో దేశంకోసం, తమ కోసం పనిచేస్తారనే నమ్మకంతో ప్రజలు ఎంపీలను గెలిపిస్తే.. ఏకంగా పార్లమెంటును బహిష్కరించేయండి.. అని సమావేశాలు మొదలు కావడానికి ముందే గులాబీ దళపతి సన్నాయి నొక్కులు నొక్కడం చాలా తమాషాగా ఉంది. బాస్ ఈ స్థాయి హింట్ ఇచ్చిన తర్వాత.. వారంతా అల్లుకుపోతారనడంలో సందేహం లేదు. పార్లమెంటు మొదలు కాగానే ఒకటి రెండు రోజులు కాస్త రభస చేసి తర్వాత పార్లమెంటు సమావేశాల బహిష్కరణ అనే మాట ప్రయోగించి ఊరుకుంటారు. 

కానీ.. ఇలాంటి బహిష్కరణ అస్త్రాలను ప్రయోగించడం ద్వారా.. ఏం సాధించగలం అని కేసీఆర్ అనుకుంటున్నారో తెలియడం లేదు. ఏవో మాయమాటలు చెప్పి, నిందలు వేసి, ఆరోపణలు వివరించి.. మోడీ సర్కారు చేస్తున్న తప్పులను ఏకరవు పెట్టి.. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తారు సరే.. తర్వాతి సమావేశాలను కూడా బహిష్కరిస్తారు సరే.. ఇదే పర్వం వ్యూహంలాగా కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీదళం మళ్లీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? మోడీ పాలన బాగుండడం లేదు అనే ఆరోపణతో అప్పుడిక రాబోయే అయిదేళ్లపాటూ తమ ఎంపీలు సభలో అడుగుపెట్టరని చెప్పేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. 

‘బహిష్కరణ’ అనేది కార్యసాధన మార్గం కాదని, నిరసనల్లో పరమోత్కృష్టరూపమేమీ కాదని కేసీఆర్ తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అదే అస్త్రంగా అవసరం అవుతుంది గానీ.. ఆ విషయాన్ని గెలిపించిన ప్రజలు పూర్తిగా నమ్మే స్థితి ఉండాలి. అలా కాకుండా.. మనం వీళ్లనుగెలిపించి తప్పు చేశాం.. వీళ్లు సభను బహిష్కరించి ఉత్తినే కూర్చుంటున్నారు అని ప్రజలు భావిస్తే పార్టీకే ప్రమాదం. 

2014 తర్వాతి పరిణామాల్లో.. చంద్రబాబు అసమర్థ పాలనను నిరసించి జగన్ సభను బహిష్కరించారు. అయినా ఆయన పట్ల ప్రజల నమ్మకం సడలలేదు. తర్వాతి ఎన్నికల సమయానికి ఆయనను తిరుగులేని ఆధిక్యంతో గెలిపించారు. అదే స్థితి ఉన్నప్పుడు మాత్రమే బహిష్కరణ అస్త్రంగా పనిచేస్తుంది. లేకపోతే.. బూమరాంగ్ అవుతుంది.