వెండితెరపై ఫ్రాంచైజీలు, సీక్వెల్స్ యుగం

జనానికి ఒక కథ, దానిలో కొందరు నటీనటులు నచ్చితే దానిని ఏళ్ల తరబడి చూడడానికి ఇష్టం చూపిస్తూనే ఉంటారు. దీనికి అతి పెద్ద ఉదాహరణ “కార్తీకదీపం” సీరియల్. గత ఐదేళ్లుగా నడుస్తూ 1500 ఎపిసోడ్స్…

జనానికి ఒక కథ, దానిలో కొందరు నటీనటులు నచ్చితే దానిని ఏళ్ల తరబడి చూడడానికి ఇష్టం చూపిస్తూనే ఉంటారు. దీనికి అతి పెద్ద ఉదాహరణ “కార్తీకదీపం” సీరియల్. గత ఐదేళ్లుగా నడుస్తూ 1500 ఎపిసోడ్స్ పూర్తి చేసేసుకున్న ఈ ధారావాహికం ఇంకా కొనసాగుతూనే ఉంది. పని చేసీ చేసీ విసొగొచ్చో ఏమో ఇందులోని హీరోహీరోయిన్లు ఈ సీరియల్ పని ఆపేసి వేరే పనులు చేసుకుందామనుకున్నారు. ఆ నిర్ణయంతో తమ క్యారెక్టర్స్ ని సీరియల్లో చంపేయమన్నారు. మొత్తానికి ఒక యాక్సిడెంటు చేసేసి వాళ్ల పాత్రలు ముగించారు. ఆ తర్వాత క్రమంగా సీరియల్ కి టీఆర్పీ తగ్గడం మొదలెట్టింది. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు లేనిదే చూడమని మొహం చాటేసారు ప్రేక్షకులు. దాంతో చేసేది లేక.. లక్కీగా యాక్సిడెంటు మాత్రమే చూపించారు కాబట్టి మళ్లీ ఆ రెండు పాత్రల్నీ కోమాలోంచి లేచినట్టు చూపించి కథ నడిపిస్తున్నారు. వాళ్ల కష్టాలు ఏమైనా గానీ, సంపాదన మాత్రం విపరీతంగా ఉంది. ఇది ఒక జీవిత కాలపు అసైన్మెంటులా తయారైంది ఇందులో పని చేసేవాళ్లకి. అలాగే వాళ్లకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిపడింది. అందుకే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. 

ఒక్క సీరియల్ విషయంలోనే ఇలా ఉంటే సినిమాల విషయం చెప్పక్కర్లేదు. ఒక ఫ్రాంచైజ్ కి క్రేజ్ మొదలైందంటే అది పదికాలాలు కొనదాగుతుందనే నమ్మకం వస్తోంది. దీనికి పెద్ద ఉదాహరణ రాజమౌళి తీసిన బాహుబలి 1 మరియు 2 భాగాలు. నిజానికి ఆ రెండు భాగాలతో ఆపేసాడు కానీ కొనసాగించి ఉంటే అదొక మహాభారతమంత ఎపిక్ అయ్యుండేది. ప్రభాస్, అనుష్కల తర్వాత మరొక జంటని పరిచయం చేయడమో, అడివి శేష్ పాత్ర యొక్క బ్యాక్ స్టోరీ చెప్పడమో, అస్లాం ఖాన్ గా గెస్ట్ పాత్రలో కనిపించిన సుదీప్ కథని చెప్పడమో..అలా అలా కశీమజిలీకథల్లాగ ముగింపు లేకుండా కొనసాగిస్తూ పోవచ్చు. వెండితెరమీద అతి పెద్ద కాన్వాసుతో భారీ సినిమా సిరీస్ ని తీసిన ఘనత రాజమౌళికే దక్కేది. దానికతను సమర్ధుడు కూడా. విడిగా మళ్లీ మహాభారతం తీయనక్కర్లేకుండా సొంత కథతో మహాభారతంలోని ఎమోషన్స్ ని, డైమెన్షన్స్ ని ఎన్నో పండిచ్చవచ్చు. కానీ ఆ పని చేయకుండా ఆర్.ఆర్.ఆర్ తీసాడు. నిజానికి ఈ సినిమా తెలుగువాడు గర్వించదగ్గంత గొప్పదేమీ కాదు. ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయంటే అది బాహుబలి-2 మీదున్న క్రేజుకి కొనసాగింపు మాత్రమే అనుకోవాలి. 

ఏది ఏమైనా ఫ్రాంచైజింగ్ చేసి వరుసగా సినిమాలు తీసే అవకాశాన్ని రాజమౌళి బాహుబలి విషయంలో వదులుకున్నాడనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ ఫ్రాంచైజ్ గా కొనసాగే యోగ్యత గల కథ కాదు. 

అది పక్కన పెడితే దృశ్యం సిరీస్ నే తీసుకుందాం. తొలిభాగం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అలాగే రెండవభాగం మలయాళ, తెలుగు వెర్షన్స్ డైరెక్ట్ ఓటీటీ రిలీజులుగా జనం ముందుకొచ్చి శభాషనిపించుకున్నాయి. అవి ఆన్లైన్లో సబ్టైటిల్స్ తో ఉన్నా కూడా మళ్లీ అజయ్ దేవగన్ తో హిందీలో తీస్తే ఈ ఏటి మేటి కమెర్షియల్ చిత్రంగా దూసుకుపోతోంది. 50కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 270 కోట్ల వరకు వసూలు చేసింది థియేటర్స్ నుంచి. అలాగే దృశ్యం-3,4..ఇలా తీసుకుంటూ పోవచ్చు. 

అలాగే కేజీఎఫ్ సిరీస్ కూడా. ఇప్పటికి రెండయ్యాయి. మూడోది తీయడానికి లైన్లో ఉంది. 

తాజాగా హిట్ సిరీస్ చూస్తున్నాం. కేవలం 10 కోట్ల ఖర్చుతో అడివి శేష్ తో తీసిన హిట్2 దూసుకుపోతూనే ఉంది. హిట్ సిరీస్ ఏకంగా 7 భాగాలు ప్లాన్ చేసారు. హాలీవుడ్లో వచ్చిన మార్వెల్ సిరీస్ లాగ ఇది కొనసాగుతూనే ఉంటుంది. 

కార్తికేయని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 1, 2 భాగాలు మంచి విజయాన్నిచ్చాయి. ఇప్పుడు మూడో భాగం కూడా లైన్లో ఉంది. కార్తికేయ2 ఎండింగులో దానికి హింటిచ్చారు. అలాగే బింబిసార కూడా. 2 వ భాగం అయితే కచ్చితంగా తీయబోతున్నారు. 

పుష్ప-2, పొన్నియన్ సెల్వన్-2, డిజె టిల్లు-2 కూడా 2023లో విడుదలకి సిద్ధమవుతున్నాయి. 

కాంతార-2 కి చాన్స్ ఉంది. సినిమా చివర్లో హీరోయిన్ గర్భం పై కెమెరా ప్యాన్ చేసాడు కాబట్టి తర్వాతి వారసుడితో కథ కొనసాగించవచ్చు. 

ఇలా చూసుకుంటూ పోతే సీక్వెల్ సంస్కృతిని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. తమ సినిమాపై ప్రేక్షకులు ఎటువంటి అంచనాలతో ఉంటారో ఆయా ఫ్రాంచైజ్ మేకర్స్ కి అవగాహన ఉంటుంది. దానికి అణుగుణంగా కథలు వండుకోవచ్చు. ఎందుకంటే ఇది వెండితెరపై ఫ్రాంచైజీలు, సీక్వెల్స్ యుగం

– శ్రీనివాసమూర్తి