చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంటే చాలు ఎల్లో మీడియాకు పూనకం వస్తుంది. బాబుతో ప్రధాని మోదీ మాట్లాడితే అదే పదివేలంటూ కథనాలను వండివార్చుతోంది. జీ-20 సన్నాహకంపై అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదేదో చంద్రబాబే ప్రత్యేకం అన్నట్టు ఎల్లో మీడియా తెగ ఉబలాటపడుతోంది.
చంద్రబాబుతో మోదీతో పది నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. పోనీ ఆ సమయంలో ఏవైనా అద్భుతాలు మాట్లా డినట్టు చెప్పారా? అంటే అదేం లేదు. ఏమయ్యా చంద్రబాబూ… బాగా చిక్కిపోయావే అని మోదీ ప్రశ్నించారట. చంద్ర బాబుకు మినహా మిగిలిన నేతలెవరికీ కేంద్ర మంత్రులు ఆహ్వానం పలకనట్టు ఎల్లో మీడియా రాయడం, చూపడం దానికే చెల్లింది.
చంద్రబాబుకు ఢిల్లీలో గొప్ప పరపతి ఉన్నట్టు సమాజానికి చూపే ప్రయత్నంలో భాగమే ఈ సర్కస్ ఫీట్లు అనే విమర్శ వెల్లువెత్తుతోంది. గతంలో మీతో చాలా మాట్లాడాల్సి వుంది అని చంద్రబాబుతో మోదీ అన్నట్టు రాయడం తెలిసింది. కనీసం ఇప్పుడైనా బాబుతో మాట్లాడారో లేదో మరి. ఇలా చంద్రబాబును ప్రత్యేకమైన నాయకుడిగా అతిశయోక్తులతో చూపడం వల్లే మిగిలిన వాళ్ల కోపాన్ని రుచి చూడాల్సి వస్తోందని గ్రహించకపోవడం గమనార్హం.
చంద్రబాబుకు జనంలో పరపతి లేదని తెలిసినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఎందుకు పట్టించుకుంటుంది? గతంలో చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే మోదీ ఖాతరు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకుని ఊరేగుతారా? హేమిటో…ఈ పైత్యం!