బీసీలకు మేమే బ్రాండ్ అంబాసిడర్లమని తెలుగుదేశం పార్టీ ఎపుడూ చెప్పుకుంటూ ఉంటుంది. ఆ పార్టీని నాలుగు దశాబ్దాలుగా బీసీలు భుజాన పెట్టుకుని మోసారు. 2019 ఎన్నికల్లో మాత్రం వారు రూట్ మార్చారు. వైసీపీ వైపుగా బీసీలు టర్న్ తీసుకున్నారు ఫలితంగా బీసీల ఖిల్లాగా పేరున్న ఉత్తరాంధ్రాలో సైకిల్ పార్టీకి బ్రేకులు పడిపోయాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టడమే కాకుండా వారికి అనేక రకాలుగా కార్యక్రమాలు అమలు చేస్తూ తమదైన సోషల్ ఇంజనీరింగ్ తో ముందుకు సాగుతోంది. వైసీపీ లెక్కల ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా అన్ని రకాలైన నామినేటెడ్ పోస్టులతో కలుపుకుని 84 వేల మంది బీసీలకు పదవులు ఇచ్చామని చెబుతున్నారు.
వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో అనేక రకాల సంక్షేమ పధకాల ద్వారా బీసీల కోసం 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా రికార్డులు చూపించి మరీ వివరిస్తున్నారు. జయహో బీసీ అంటూ విజయవాడలో ఈ నెల 7న భారీ ఎత్తున వైసీపీ నిర్వహిస్తున్న సదస్సుని నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించడానికి వైసీపీ సర్వం సిద్ధం చేసుకుంది.
ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దాకా అంతా బీసీల మీద పేటెంట్ హక్కులు అన్నీ తమవేనని చెబుతున్నారు. బీసీ అన్న పేరు ఎత్తే హక్కు వైసీపీకి లేదని తమ్ముళ్ళు తీర్మానించేశారు. బీసీల సదస్సు అసలు ఎలా నిర్వహిస్తారు అంటూ అబ్జెక్షన్ పెడుతున్నారు.
ఇవన్నీ చూస్తూంటే టీడీపీ లబలబలాడుతోంది అని వైసీపీ నేతలు అంటున్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా టీడీపీ వాడుకుంటే తాము వారికి అన్ని రకాలుగా న్యాయం చేశామని బీసీలు ఎప్పటికీ తమ వెంటనే ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో నూటికి తొంబై శాతం ఉన్న బీసీలు వైసీపీతోనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీసీల ఖిల్లాలో ఇపుడు జయహో బీసీ సభ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రభావం 2024 ఎన్నికల్లో ఎలా ఉంటుందో కానీ విపక్షంలో ఉండి సభలు పెట్టాల్సిన టీడీపీ విమర్శలకు పరిమితం అవుతూంటే వైసీపీ బీసీలంటే మావాళ్ళే అని సదస్సులు పెట్టి మరీ సవాల్ చేయడం సరి కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీసేలా కనిపిస్తోంది అంటున్నారు.