హీరో నితిన్ మరి కొన్ని గంటల్లో తాను కోరుకున్న యువతి షాలిని మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి ఓ ఇంటి వాడు కానున్నాడు. అయితే తనకు పెళ్లిరోజు కూడా టార్చర్ తప్పడం లేదని అతను ఆవేదన వ్యక్తం చేస్తూ…ఏకంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. శుభమా అని పెళ్లి రోజు కూడా వేధిస్తున్నది ఎవరా అనే అనుమానం, ఆగ్రహం అభిమానుల్లో కలగకమానవు.
ఇంతకూ నితిన్‌ను టార్చర్ పెడుతున్నది పరాయి వారెవరో కాదండోయ్…‘రంగ్ దే’ యూనిట్. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
‘రంగ్ దే’లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి. నితిన్ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది. పెళ్లి వేడుకను పురస్కరించుకుని నితిన్‌కు, ఆయన అభిమానులకి చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ఆలోచించింది. కాగా ‘నాన్నా… నవ్వుతుంది నేను కట్టలేను నాన్నా’.. అని నితిన్ చెప్పిన డైలాగ్ ఉన్న టీజర్‌ను ‘రంగ్ దే’ యూనిట్ విడుదల చేసింది.
ఈ విషయమై నితిన్ సరదాగా స్పందించాడు. పెళ్లి పీటలు ఎక్కుతున్న ఆనందాన్ని కూడా మిగిల్చకుండా తమ డైరెక్టర్ టార్చర్ పెట్టాడంటూ నితిన్ ఆటపట్టించేందుకు చెప్పుకొచ్చాడు. తనకు పెళ్లి గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తే…నితిన్ మాత్రం ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బింగ్ చెప్పినట్టు నితిన్ తెలిపాడు. పెళ్లి పనుల్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా డబ్బింగ్ చెప్పిన నితిన్‌కి దర్శకుడు కృతజ్ఞతలు చెప్పాడు.
కాగా ‘రంగ్ దే’ చిత్ర యూనిట్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో సాయంత్ర 4గంటల 5 నిమిషాలకు తెలుస్తుంది. ఎందుకంటే సరిగ్గా అదే శుభలగ్నంలో నితిన్ ఓ ఇంటి వాడు కానున్నాడు.