ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఆడిన కిడ్నాప్ డ్రామా థ్రిల్లర్ సినిమాను మరిపించింది. రూ.కోటి ఇస్తే అమ్మాయిని వదిలేస్తామని కిడ్నాపర్ నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులకు కొన్ని గంటల పాటు దిక్కుతోచలేదు. ఆ తర్వాత తేరుకుని పోలీసులను ఆశ్రయించడంతో…ప్రియుడితో కలిసి కూతురు ఆడిన డ్రామా బట్టబయలైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా నాగ్లా భజనా గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి గురువారం రాత్రి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత తన సెల్ ఫోన్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కిడ్నాప్‌నకు గురైనట్టు ఏడుస్తూ చెప్పింది. యువతి నుంచి కిడ్నాపర్ సెల్ తీసుకుని అమ్మాయి తల్లిదండ్రులను కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
అసలేం జరిగిందో ఎటా జిల్లా ఎస్పీ రాహుల్‌కుమార్ వివరాలు వెల్లడించారు. యువతీ తన పొరుగింటి యువకుడితో రెండేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నట్టు చెప్పారు. వీరిద్దరి వ్యవహారం యువతి తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. యువతి కుటుంబం రూ.కోటితో ఒక స్కూల్‌ను ప్రారంభించే ఆలోచనతో ఉండడాన్ని యువతి పసిగట్టిందన్నారు.
ఈ నేపథ్యంలో తన ప్రియుడితో ఆ యువతి కిడ్నాప్ డ్రామాకు పథక రచన చేసినట్టు ఎస్పీ తెలిపారు. కోటి రూపాయలతో ఇద్దరూ ఎక్కడైనా పారిపోవాలని ఆలోచించుకుని, గురువారం రాత్రి తమ పథకాన్ని పక్కాగా అమలు చేశారన్నారు. తల్లిదండ్రు లకు పదేపదే ఫోన్ చేస్తూ కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. అయితే మొదట్లో ఇది ప్రొఫెషనల్ కిడ్నాపింగ్ గ్యాంగ్ పనే అని భావించామన్నారు.
వరుస ఫోన్ కాల్స్ రావడంతో అనుమానం వచ్చిందన్నారు. దీంతో సర్వైలెన్స్ టీంతో యువతి సెల్‌ఫోన్ నెంబర్‌ను, ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసినట్టు ఎస్పీ చెప్పుకొచ్చారు. కేవలం ఇంటికి వంద మీటర్ల దూరం నుంచి కాల్స్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. పోలీసుల దాడిలో ప్రియుడు తప్పించుకున్నాడన్నారు. అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. కూతురి నిర్వాకానికి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.