తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బామ్మర్ది శ్రీధర్‌రెడ్డి వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తిని బావ అయిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కాజేశారని, ఇంటి వద్ద బోరు వేసుకుంటుంటే అడ్డుకున్నారంటూ శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని ఓవర్ యాక్షన్ చేశారు.
ఇదంతా డ్రామా అని శ్రీధర్‌రెడ్డి తండ్రి వెంకటనారాయణరెడ్డి తేల్చి చెప్పడంలో ఈ ఎపిసోడ్‌లో సరికొత్త ట్విస్ట్. తన కుమారుడు సామాను శ్రీధర్‌రెడ్డి నానా యాగీ చేసిన నేపథ్యంలో ఆయన తండ్రి, ఎమ్మెల్యే మామ వెంకటనారాయణరెడ్డి మీడియా ముందుకొచ్చారు.
కూతురు, అల్లుడికి మద్దతుగా నిలిచారు. ఇదే సందర్భంలో కుమారుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకుంటానని డ్రామాలు చేయడం ఇదేమీ కొత్తకాదని చెప్పుకొచ్చారు. 30 ఎకరాల్లో శ్రీధర్‌రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నట్టు చెప్పారు. ఇంట్లో నుంచి తనను, తన భార్యను తరిమేశాడని వాపోయారు. తన కుమార్తె, అల్లుడిని ఇష్టానుసారం శ్రీధర్ తిడుతున్నాడని ఆరోపించారు.
పసుపు, కుంకుమల కింద కుమార్తెకు పది ఎకరాలు ఇచ్చామన్నారు. అందులో 8 ఎకరాలు అమ్ముకున్నారని, మిగిలిన రెండెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారని ఆయన తెలిపారు. దాన్ని కూడా తన కుమారుడు కాజేసేందుకు ఆత్మహత్య డ్రామాకు తెరలేపాడని మండిపడ్డారు. ఈ మొత్తం వివాదానికి శ్రీధర్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ సుబ్రమణ్యంరెడ్డి (మాజీ జెడ్పీ చైర్మన్) కారణమని ఆరోపించడం గమనార్హం. ఇదిలా వుండగా శ్రీధర్‌రెడ్డిపై ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.