జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కేంద్ర బీజేపీ అవమానిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. పైగా కేంద్ర బీజేపీ పెద్దలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని పవన్ చెబుతున్న తరుణంలో, వారు మాత్రం పట్టించుకోకపోవడంపై జనసేన గుర్రుగా వుంది. జీ-20 అఖిలపక్ష సమావేశానికి పవన్‌ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ (జీ-20) దేశాలకు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ వరకూ ఏడాది పాటు మన దేశం నాయకత్వం వహించనుంది.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను విజయవంతం చేసి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి వివిధ రాజకీయ పక్షాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (నేడు) సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి ఏపీ నుంచి సీఎం జగన్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఇద్దరూ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. కానీ బీజేపీకి మిత్రపక్షమైన జనసేన అధినేతకు ఆహ్వానం అందకపోవడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌ను అవమానించడం ఇది రెండోసారి అని జనసేన నేతలు చెబుతున్నారు. ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేంటో తెలియదు కానీ, అందులోకి జనసేన రానట్టుంది. అందుకే ఆయన్ను పిలవలేదని బీజేపీ నేతలు అంటున్నారు.
రాజకీయ ప్రయోజనాల రీత్యా పవన్‌ను పిలిచి వుంటే బాగుండేదని టీడీపీ అనుకూల బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తుండడం వల్లే ఆయన్ను బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే దూరంగా పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై పవన్ స్పందిస్తారో, లేదో చూడాలి.