కర్నూలు వేదికగా ఇవాళ వైసీపీ గర్జించనుంది. సీమకు హైకోర్టు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను చాటి చెప్పేందుకు వైసీపీ గర్జనకు సిద్ధమైంది. అధికార పార్టీగా వుండి వైసీపీ గర్జించడం ఏంటనే ప్రశ్నలు కొన్ని రాజకీయ పక్షాల నుంచి వస్తున్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం నోరెత్తకపోవడాన్ని గమనించొచ్చు. రాయలసీమ గర్జన సభ నిర్వహించడంపై వైసీపీని నిలదీసే బాధ్యతను టీడీపీ తరపున ఆ పార్టీ అనధికార ప్రతినిధి అయిన సీపీఐ రామకృష్ణ ఎప్పట్లాగే తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమ, ఉత్తరాంధ్ర విషయాల్లో వైసీపీని ప్రశ్నించడానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడల్లా… తమ నమ్మకస్తుడైన సీపీఐ నాయకుడు రామకృష్ణను టీడీపీ ముందుకు తోస్తూ వుంటుంది. తమ పార్టీని బలోపేతం చేయడం కంటే, టీడీపీ ప్రయోజనాలను కాపాడ్డంలో రామకృష్ణ ఎంతో చురుగ్గా పని చేస్తుంటారు. సీమ గర్జనను తప్పు పట్టడంలో కూడా రామకృష్ణ అదే చొరవ చూపుతున్నారు.
సీమ గర్జన ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు గట్టిగా నిలదీస్తున్న దాఖలాలు లేవు. ఎందుకంటే రాజకీయంగా తమకు నష్టం కలుగుతుందనే భయంతోనే ఆ పార్టీలు భయంతో నోర్మూసుకున్నాయి. ఇటీవల చంద్రబాబు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు సీమ వాసులు పెద్ద ఎత్తున హైకోర్టుపై నిలదీశారు. దీంతో ఆయన కంగుతిన్నారు. చంద్రబాబును రాజకీయేతర నాయకులు, విద్యార్థులే ప్రశ్నించారు.
సీమకు హైకోర్టు ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారనే ఆగ్రహం ఆ ప్రాంత ప్రజానీకంలో వుంది. ఇది పసిగట్టిన చంద్రబాబు రాజధాని విషయంలో ఆచితూచి మాట్లాడ్డమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు. ఇక టీడీపీకి లేని దురద తమకెందుకని జనసేన నేతలు కూడా మౌనాన్ని ఆశ్రయించారు.