వాళ్లిద్దరూ కవలలు. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగారు, కలిసి చదివారు, ఒకేసారి ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయ్యారు. పెళ్లయిన తర్వాత మాత్రం విడిపోవాలని వాళ్లకు తెలుసు. అక్కడ కూడా విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఒకే అబ్బాయిని పెళ్లాడారు. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన.
సోలాపూల్ జిల్లాలోని అక్లుజ్ లో నివశిస్తారు రింకీ-పింకీ. ఇద్దరూ బాగా చదువుకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఆ ఇంటికి సమీపంలోనే అతుల్ కూడా ఉంటాడు. ఓ సందర్భంలో రింకీ-పింకీ తల్లికి బాగా జబ్బు చేస్తే, అన్నీ తానై చూసుకున్నాడు అతుల్. తన కారులోనే హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లాడు.
సరిగ్గా అక్కడే అతుల్ కు కనెక్ట్ అయ్యారు ఈ కవల సిస్టర్స్. అతుల్ మంచితనం వాళ్లను కట్టిపడేసింది. అయితే ఎవరో ఒకరు అతడ్ని పెళ్లి చేసుకోవడం సమంజసం కాదని ఇద్దరికీ తెలుసు. అందుకే ఇద్దరూ కలిసి అతుల్ ను పెళ్లాడాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించారు.
ఆశ్చర్యంగా అతుల్ ఇంట్లో కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అలా ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు కలిసి అతుల్ ను ఒకేసారి పెళ్లాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే ఈ పెళ్లి వ్యవహారం వివాదాస్పదమైంది. హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి ఇద్దర్ని పెళ్లాడడం నేరం. అందుకే ఐపీసీ సెక్షన్-494 కింద, సోలాపూర్ పోలీసులు అతుల్ పై కేసు పెట్టారు.