ఆయ‌న భార్య ఐఏఎస్ అని క‌ల‌వాల‌నుకున్నా!

తెలంగాణ బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వెంటాడుతున్నాయి. ఒక దాని వెంట మ‌రొక‌టి విచార‌ణ పేరుతో ఆయ‌న్ను పిలిపించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల గంగుల‌, ఆయ‌న బంధువులు, స్నేహితుల ఇళ్లు,…

తెలంగాణ బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వెంటాడుతున్నాయి. ఒక దాని వెంట మ‌రొక‌టి విచార‌ణ పేరుతో ఆయ‌న్ను పిలిపించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల గంగుల‌, ఆయ‌న బంధువులు, స్నేహితుల ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌కిలీ సీబీఐ అధికారి శ్రీ‌నివాస్ ఉదంతంలో గంగుల క‌మ‌లాక‌ర్ సీబీఐ ద‌ర్యాప్తును ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

త‌న‌ను కేసుల నుంచి బ‌య‌ట ప‌డేసేందుకు శ్రీ‌నివాస్‌కు కోట్లాది రూపాయ‌ల ముడుపులు మంత్రి ముట్ట‌జెప్పిన‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో సీబీఐ విచార‌ణ‌కు ఆయ‌న ఢిల్లీ వెళ్లి వ‌చ్చారు. సీబీఐ త‌న‌ను విచారించ‌డంపై ఆయ‌న మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. ధ‌ర్మేంద‌ర్ అనే వ్య‌క్తి సూచ‌న మేరకు శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తిని క‌లిసిన‌ట్టు గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ అని శ్రీ‌నివాస్ గురించి చెబితే గ‌ర్వంగా ఫీల్ అయ్యాన‌న్నారు. శ్రీ‌నివాస్ భార్య కూడా ఐఏఎస్ అని చెప్ప‌డంతో ఆమెను కూడా క‌ల‌వాల‌ని అనుకున్న‌ట్టు శ్రీ‌నివాస్‌తో చెప్పాన‌న్నారు.

ఆ రోజు అతనితో దిగిన ఫొటో సీబీఐ అధికారుల వద్ద ఉందన్నారు. ఆ రోజు, మరుసటి రోజు గంట సేపు శ్రీ‌నివాస్‌తో సాధార‌ణ విష‌యాలు త‌ప్ప‌, మ‌రే సంగ‌తులు మాట్లాడ‌లేద‌న్నారు.  తాను మంత్రి కావ‌డంతో విచార‌ణ‌కు పిలిపించార‌న్నారు. సీబీఐ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాన‌ని, శ్రీ‌నివాస్ కూడా తాను చెప్పిన‌ట్టే చెప్పార‌న్నారు.  త‌మ‌కు ఏ పని ఉన్నా అధికారులతో నేరుగా మాట్లాడుతామన్నారు. అంతే త‌ప్ప‌, మధ్యవర్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

అధికారం శాశ్వ‌తం కాద‌న్నారు. వ్య‌వ‌స్థ‌లు శాశ్విత‌మ‌న్నారు. కావున అవి బాగుండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తాము ఎలాంటి అవినీతి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.