ఆలు లేదు.. చూలు లేదు అనే సామెత చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడీ వ్యవహారం కూడా అలానే ఉంది. ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
కేవలం పుకార్లు మాత్రమే షికారు చేస్తున్నాయి. ఆమాత్రం దానికే ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే..
త్వరలోనే మరో సినిమా ప్రకటించబోతున్నాడట ప్రభాస్. కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం అది. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 7న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఫ్యాన్స్ కు ఎందుకు కోపం..
ఇంకా ప్రకటించని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయనే ప్రచారం మొదలైంది. సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ కు మండింది. యూవీ క్రియేషన్స్ వరకు ఓకే.. టీ-సిరీస్ ను ఎందుకు భాగస్వామిగా చేసుకున్నారనేది సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన.
బాలీవుడ్ సినిమాల వరకు ఓకే కానీ, సౌత్ మూవీస్ కు వచ్చేసరికి టీ-సిరీస్ కు ప్లానింగ్ ఉండదు. ఇక్కడి ఆడియన్స్ పల్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కు తగ్గట్టు ఆ సంస్థ వ్యవహరించదు. ఆల్రెడీ రాధేశ్యామ్ విషయంలో ఫ్యాన్స్ హర్ట్ అవుతూనే ఉన్నారు.
యూట్యూబ్ లో పెట్టే వీడియోలను ఆ సంస్థ పెద్దగా పట్టించుకోదని, ట్రెండ్ చేయదని ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు. పైగా సౌత్ సినిమాలకు సంబంధించి ఆ సంస్థ రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వదనే కంప్లయింట్స్ కూడా ఉన్నాయి. దీనికితోడు టీ-సిరీస్ జనాలు మంచి మ్యూజిక్ డైరక్టర్లను పెట్టరనే అపవాదు కూడా ఉంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ ను ఆడిపోసుకుంటున్నారు అతడి ఫ్యాన్స్. ఎందుకు టీ-సిరీస్ వెంట పడుతున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి హీరోలకు ఇవన్నీ అక్కర్లేదు కదా. ఎవరు భారీ మొత్తం ఆఫర్ చేస్తే వాళ్లకే కాల్షీట్లు ఇస్తుంటారు.