బాగా కష్టపడి ఎదిగి వచ్చిన వారిలో, చిన్నతనంలో కుటుంబ కష్టాలను చవి చూసిన వారిలో.. ఎదిగిన తర్వాత ఒక తత్వం వస్తుంది. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదు.. అనేది వారిలో బాగా ఏర్పడే తత్వం. బాగాకష్టనష్టాలను చవిచూసి, కసి కొద్దీ ఎదిగిన వారు కూడా.. తమ పిల్లల విషయంలో కష్టనష్టాలను అలవర్చడం కాదు కదా, వారికి చిన్న పాటి ఇబ్బంది కూడా తలెత్తకుండా చూసుకుంటారు. తమ ఆర్థిక శక్తి కొద్దీ తమ పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి బాలీవుడ్ స్టార్లు కూడా మినహాయింపు కాదు.
అలాంటిది కింగ్ ఖాన్ షారూక్ తనయుడు అంటే.. అతడికి ఏం లోటు ఉంటుంది? లోటు అనే మాటకు అర్థం కూడా ఆర్యన్ ఖాన్ కు తెలియకపోవచ్చు. ఆస్తులూ, ఆడంబరాలే కాదు.. షారూక్ తనయుడు అంటే.. దొరికే రాయల్ ట్రీట్ మెంట్ ను కూడా ఆర్యన్ పరిపూర్ణంగా ఆస్వాధిస్తూ ఉండవచ్చు. 21 యేళ్ల ఆర్యన్ ఖాన్ నాలుగేళ్ల నుంచినే డ్రగ్స్ వాడుతున్నాడనేది ఎన్సీబీ ద్వారా బయటకు పొక్కిన అంశం!
అంటే మైనర్ గానే ఇలాంటి అలవాట్ల వైపు షారూక్ తనయుడు తొంగి చూసి ఉండాలి. గతంలో తన తనయుడి విషయంలో షారూక్ స్పందిస్తూ.. అతడు డేటింగ్ చేసినా, డ్రగ్స్ వాడినా తనకు అభ్యంతరం ఉండదన్నట్టుగా మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు తెర మీదకు వస్తోంది. అది సరదాగానే అయినా.. సగటు తండ్రి లానే షారూక్ స్పందించాడు. తన చిన్నతనంలో, యుక్తవయసులో డబ్బు లేకపోవడం వల్ల బతకాలనుకున్నట్టుగా బతికి ఉండకపోవచ్చు. అలాంటి లోటు తన కొడుకు ఉండకూడదని షారూక్ కూడా భావించి ఉండవచ్చు.
అయితే లోటు లేకుండా బతకడానికి విశృంఖలతకూ చాలా తేడా ఉంది. ప్రస్తుత తరం రాజకీయ నేతలు, సినీతారల పిల్లల్లో కొంతమంది ఈ విశృంఖలతకు అలవాటు పడుతున్న వైనం బయటపడుతూ ఉంది. వారు వాహనాలను నడిపే తీరు, రేవ్ పార్టీలు, ఇలాంటి డ్రగ్స్ వ్యవహారాలు.. ఇలాంటి వ్యవహారాల్లో ఈ ఉన్నింటి వారి పిల్లలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు.
మరి తమ పిల్లలు ఏ లోటూ లేకుండా పెరగాలనేది ప్రతి తల్లీదండ్రీ కోరికే కానీ, అది మరీ ఎక్కువ అయిపోతే.. మాత్రం ఇలాంటి పర్యవసనాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని షారూక్ కు ఇప్పుడు అర్థం అవుతూ ఉండాలి.