అక్టోబ‌ర్ ఆరంభం.. త‌గ్గుముఖంలో క‌రోనా కేసులు!

ఈ ఏడాది అక్టోబ‌ర్ లో క‌రోనా తీరుతెన్నుల గురించి చాన్నాళ్లుగా ర‌క‌ర‌కాల ప్రిడిక్ష‌న్లు వినిపించాయి. అక్టోబ‌ర్లో ఇండియాలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌నే అభిప్రాయాలు గ‌ట్టిగా వినిపించాయి ప‌రిశోధ‌కుల నుంచి. మే నెల‌లోనే ఈ…

ఈ ఏడాది అక్టోబ‌ర్ లో క‌రోనా తీరుతెన్నుల గురించి చాన్నాళ్లుగా ర‌క‌ర‌కాల ప్రిడిక్ష‌న్లు వినిపించాయి. అక్టోబ‌ర్లో ఇండియాలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉంటుంద‌నే అభిప్రాయాలు గ‌ట్టిగా వినిపించాయి ప‌రిశోధ‌కుల నుంచి. మే నెల‌లోనే ఈ టాక్ వినిపించింది.

జూలై నెలాఖ‌రుకు సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని, అక్టోబ‌ర్ నాటికి మూడో వేవ్ పుంజుకోవ‌చ్చ‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తీక‌రించారు నిపుణులు. మ‌రి ఆ సంగ‌తేమో కానీ.. అక్టోబ‌ర్ మొద‌టి వారంలో క‌రోనా అవ‌రోహ‌ణ క్ర‌మంలోనే కొన‌సాగుతూ ఉంది.

జూలై నుంచి త‌గ్గుముఖం ప‌ట్టిన సెకెండ్ వేవ్ కు సంబంధించి ఇటీవ‌ల నంబ‌ర్లు కాస్త పెర‌గ‌డంతో మ‌ళ్లీ ఆందోళ‌న రేగింది. ప్ర‌త్యేకించి కేర‌ళలో క‌రోనా కేసులు గ‌ట్టిగా వ‌చ్చాయి. అక్క‌డ ఓనం- బ‌క్రీదు పండ‌గ‌ల త‌ర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య పాతిక వేల వ‌ర‌కూ పెరిగింది! కేర‌ళ వంటి రాష్ట్రంలో ఏకంగా పాతిక వేల సంఖ్య‌లో కేసులు రావ‌డం అంటే మాట‌లేమీ కాదు. మూడో వేవ్ కు కేర‌ళ హాట్ స్పాట్ అవుతుందేమో అనే స్థాయిలో అప్పుడు భయాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. 

అయితే ఇప్పుడు ఊర‌ట ఏమిటంటే.. కేర‌ళ‌లో కూడా కేసుల సంఖ్య త‌గ్గుతూ ఉండ‌టం. గ‌త వారం నుంచి కూడా కేర‌ళ‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అవ‌రోహ‌న క్ర‌మంలో కొన‌సాగుతూ ఉంది. క్ర‌మంగా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. దీంతో దేశం మొత్తం న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య కూడా త‌గ్గుతూ ఉంది. ఇటీవ‌లి కాలంలో దేశం మొత్తం మీద వ‌చ్చిన కేసుల్లో 60 శాతంపై స్థాయి కేసులు కూడా కేర‌ళ‌లోనే వ‌చ్చాయి. ఇప్పుడు కేర‌ళ‌లో ఆ సంఖ్య త‌గ్గ‌డంతో.. దేశంలో రోజువారీగా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య‌లో కూడా త‌గ్గుద‌ల చోటు చేసుకుంటోంది.

కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం రోజున వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం… దేశం మొత్తం మీదా 20,799 కేసులు వ‌చ్చాయి. ఇందులో కేర‌ళ వాటా 12,297. ఇలా ఇప్ప‌టికీ కేర‌ళలో న‌మోదైన కేసులే మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డ కేసుల సంఖ్య అయితే రోజువారీగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఇక త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో కూడా కేసుల సంఖ్య బాగా త‌గ్గింది. క‌ర్ణాట‌క‌లో వెయ్యి లోపు, త‌మిళ‌నాడులో 1500 స్థాయిలో రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో 2,692 కేసులు న‌మోద‌య్యాయి.

ఏతావాతా.. అక్టోబ‌ర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య అవ‌రోహ‌న క్ర‌మంలో కొన‌సాగుతూ ఉండ‌టం ఊర‌ట‌ను ఇచ్చే అంశం. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో రొటీన్ యాక్టివిటీస్ ఊపందుకుంటున్నాయి. అయితే రాబోయే పండ‌గ‌ల నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబ‌ర్ సాఫీగా గ‌డిచిపోతే.. న‌వంబ‌ర్ కు క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా మ‌రింత ధీమా పెర‌గడం ఖాయం.