న్యాయ రాజధాని పేరుతో రాయలసీమలో రాజకీయ అలజడి జరుగుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతోంది. కానీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యంగా వైసీపీ గట్టిగా చెబుతోంది.
మరో వైపు న్యాయ రాజధాని సాధాన కోసం రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ, ఆ పార్టీ మద్దతుతో ర్యాలీలు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కర్నూలులో వైసీపీ మద్దతుతో జేఏసీ నేతృత్వంలో భారీ సభ నిర్వహణకు నిర్ణయించారు. ఈ సభకు రాయలసీమ గర్జన అని పేరు పెట్టారు. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది.
ఇదిలా వుండగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుతో తమ బతుకులు మారుతాయనే భ్రమలు తమలో లేవని ఆ ప్రాంత మేథావులు, ఉద్యమకారులు చెబుతున్నారు. అధికార పార్టీ తమ నిర్ణయాలు, నినాదాలు, విధానాలకు మద్దతుగా సభలు, సమావేశాలు, ఉద్యమాలు నడిపిస్తున్నదే తప్ప, సీమ నిజమమైన ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని వారు విమర్శిస్తున్నారు.
రాయలసీమ బీడు భూములకు సాగునీరు అందిస్తే, తరతరాల కరువు రక్కసి నుంచి విముక్తి కలుగుతుందనేది వారి అభిప్రాయం. సీమ సమాజాన్ని కరువు నుంచి బయటపడేసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని ఆయన నిబద్ధతను ప్రశంసిస్తున్నారు. కానీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మాత్రం సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు సీమ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకోగా, ఆయన తనయుడు కనీసం లింక్ కెనాల్స్ తవ్వించి నీళ్లు అందించలేని దుస్థితి నెలకుంది. సీమ వాసులు ప్రధానంగా కర్నూలు జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణాన్ని కోరుకుంటున్నారు. ఇది సీమకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. దాదాపు 90 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల పాలనలో మెకన్జీ సిఫార్సుల మేరకు సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేయడంతో పాటు అంగీకారం కూడా తెలిపారు. ఆ తర్వాత 1958లో భారత ప్లానింగ్ కమిషన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. అప్పట్లో 250 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించారు.
ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేస్తే… రాయలసీమ సమాజం శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటుంది. బీడు భూములకు సాగునీరు అందిస్తే, రైతాంగం సుభిక్షంగా వుంటే అన్ని రంగాలు కళకళలాడుతాయి. సంక్షేమ పథకాల అవసరం లేకుండా ప్రజలు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు ప్రధానంగా సాగునీళ్లు రావాలి, కావాలి. ఈ సంగతి జగన్కు తెలియంది కాదు. కానీ ఆయన సాగునీటి ప్రాజెక్టులపై గత మూడున్నరేళ్లలో ఏ మాత్రం దృష్టి సారించలేదు.
కనీసం ఈ ఏడాదిన్నర సమయంలోనైనా రాయలసీమ సమాజం కోసం పని చేయాల్సిన అవసరం వుంది. తమ ఆకాంక్షలకు తగ్గట్టు గర్జించడం కాకుండా, ప్రజానీకం వైపు నుంచి ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు రాయలసీమ గర్జన సభ వేదిక కావాలి.