Advertisement

Advertisement


Home > Politics - Opinion

స్కూల్లో స్మార్ట్ ఫోన్ బ్యాన్- విద్యార్థుల్లో మార్పు

స్కూల్లో స్మార్ట్ ఫోన్ బ్యాన్- విద్యార్థుల్లో మార్పు

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మ గ్రామంలో ఒక గురుకుల పాఠశాల. అక్కడ కనీసం కరెంటు కూడా ఉండదు. కనుక మొబైల్ ఫోన్స్, టీవీలు వంటి వాటికి చోటే లేదు. ఎప్పుడైతే కరెంటు ఉండదో అక్కడి విద్యార్థులు గానీ, అధ్యాపకులు గానీ చీకటి పడగానే రోజుని ముగిస్తారు. తొలి కిరణాలు తమ ప్రాంతాన్ని తాకే మునుపే నిద్రలేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. వారు చదువులో భాగంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి సనాతన జీవనవిధానాన్ని అవలంబిస్తున్నారు. 

అక్కడి విద్యార్థులకి హీరో చిరంజీవి ఎవరో తెలీదు, కొందరికి సినిమా అనే ప్రక్రియ కూడా ఏమిటో అవగాహన లేదు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భగవద్గీతని పాఠ్యభాగంగా అభ్యసించడం వాళ్ల దైనందిన కార్యక్రమాల్లో కొన్ని. ఇదంతా 2022 లో జరుగుతున్న విషయం. 

ఇక అక్కడి నుంచి బయటి ప్రపంచానికి వస్తే...స్మార్ట్ ఫోన్స్ విప్లవం మనిషి జీవితాన్ని ఎంతెలా శాసిస్తోందో చూస్తున్నాం. కొత్త తరం పిల్లల మనస్తత్వం మీద స్మార్ట్ ఫోన్స్ దాడి విపరీతంగా ఉంది. మానవసంబంధాల పట్ల ఆసక్తి తగ్గిపోయి యంత్రంతో సావాసం చేసే పరిస్థితి పెరిగిపోయింది. 

కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్స్ ద్వారానే పాఠాలు విన్న విద్యార్థులు స్కూళ్లు తెరిచినా కూడా తోటి విద్యార్థులతో మమేకం కాకుండా ఫోన్లకే అతుక్కుని ఉండడం చూసి అమెరికాలోని మసాచుసెట్స్ లోని బక్స్టన్ స్కూల్లో స్మార్ట్ ఫోన్స్ ని బ్యాన్ చేసేసారు. ఆ 114 ఎకరాల ప్రాంగణంలో ఏ విద్యార్థి గానీ, అధ్యాపకులు కానీ స్మార్ట్ ఫోన్స్ వాడరు. 

దీనివల్ల విద్యార్థుల్లో ఎంతో మార్పు వచ్చిందని, మానవ సంబంధాలు పెరిగాయని, కళల ద్వారా తమని తాము వ్యక్తపరుచుకునే ప్రతిభ కూడా విద్యార్థుల్లో గణనీయంగా పెరిగిందని స్కూల్ ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. 

స్మార్ట్ ఫోన్స్ లేని కాలం, ఇంటర్నెట్ లేని యుగం ఇప్పుడు మధ్యవయసులో ఉన్న అందరికీ అనుభవమే. కానీ ఇంటెర్నెట్ యుగంలో పుట్టిన పిల్లలకి ఆ యుగం ఎలా ఉండేదో కూడా తెలియదు. కనుక టైం మెషీన్ కాన్సెప్ట్ లాగ అప్పుడప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేయాలి. అప్పుడే వాళ్లు తమని తాము తెలుసుకోగలుగుతారు. 

స్మార్ట్ ఫోన్ యుగంలో కేవలం స్పందనలు, ప్రతిస్పందనలే మిగులుతున్నాయి. సృజనాత్మకత తగ్గిపోతోంది. కొత్తతరంపై దీని ప్రభావం స్వాగతించతగ్గది కాదు. అందుకే అప్పుడప్పుడు డిజిటల్ డిటాక్స్ అవసరం. 

నిజానికి డిజిటల్ డిటాక్స్ అనేది పిల్లలకే కాదు..అందరికీ అవసరం. ఏడాదికి కనీసం 15 రోజులైనా స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ లేని ప్రపంచంలో గడపి మరిచిపోయిన తమలోని తమని గుర్తుచేసుకోవాలని ఎందరో అనుకుంటున్నారు. ఆ దిశగా డిజిటల్ డిటాక్స్ సెంటర్స్ కూడా వెలుస్తాయేమో చూడాలి. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?