రాజకీయంలో రోజులు మారాయి. చెట్టుపేరు చెబితేనో, బెదిరించి-హెచ్చరించి రాజకీయాలు చేసే రోజులు కావివి! ఇలాంటి రాజకీయం చేస్తే ఎలాంటి వారిని అయినా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టగలరు. పార్టీలకు, నేతలకు కంచుకోటలు అనుకోవడం కూడా ఇప్పుడు ఉత్తుత్తి మాటే! ఇలాంటి కంచుకోటలను ప్రజలు ఎలాంటి సమయంలో అయినా తమ ఓటుతో బద్ధలు కొట్టగలరు. ఈ విషయం ప్రతి ఎన్నికలప్పుడూ రుజువు అవుతూనే ఉంది.
ఇలా తమ కంచుకోటను కోల్పోయిన వారిలో పరిటాల కుటుంబీకులు కూడా ఉన్నారు. తమకు తిరుగులేదనుకున్న మండలాల్లో తిరస్కారంతో గత ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీ రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తయ్యింది. మరి బద్ధలైన ఈ కంచుకోటను తిరిగి నిలబెట్టుకోవడమే వీరి ముందున్న అతి పెద్ద టార్గెట్! అందులోనూ అక్కడ వీరి రాజకీయ ప్రత్యర్థి దొరికిన అవకాశంతో పాతుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వరసగా వీరి చేతిలో ఓడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వచ్చిన అవకాశంతో చెలరేగిపోతూ ఉన్నాడు.
రాప్తాడు నియోజకవర్గం రాజకీయంలో ప్రకాష్ రెడ్డి దాదాపు 15 సంవత్సరాల్లో తలపండిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చిక్కిన అవకాశంతో ప్రకాష్ రెడ్డి తన పరపతిని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి 2009లోనే ప్రకాష్ రెడ్డి పరిటాల ఫ్యామిలీకి గట్టి పోటీ ఇచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ లో అనైక్యత ఆయనను ఓడించింది. పరిటాల సునీతను గెలిపించింది. ఆ మాత్రం విజయాలతోనో పరిటాల ఫ్యామిలీ రాప్తాడును తమ కంచుకోటగా భావిస్తూ వచ్చింది. 2014లో నెగ్గినా, 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. అది కూడా భారీ ఓట్ల తేడాతో పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యారు.
రాజకీయ జీవితాన్ని అలా ఓటమితో ప్రారంభించిన పరిటాల శ్రీరామ్ ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో ఈదాలని ఆరాటపడుతూ ఉండటమే విడ్డూరం! పరిటాల కుటుంబానికి ధర్మవరం నియోజకవర్గం బాధ్యతను కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు అంటే వేరే మార్గం లేదు. పార్టీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇక్కడ నాయకుడిగా చలామణి అయిన వరదాపురం సూరి పార్టీ నుంచి అధికారం చేజారగానే బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. దీంతో ధర్మవరానికి ఒక ఇన్ చార్జి అవసరంతో చంద్రబాబు పరిటాల కుటుంబానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ రాప్తాడులో వీరి విజయపథం కొనసాగుతూ ఉండి ఉంటే అదో లెక్క!
మరి రాప్తాడులోనే ఏటికి ఎదురుదీతున్నట్టుగా ఉంది పరిస్థితి. అధికారం చేతిలో లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుందో పరిటాల ఫ్యామిలీకి ఇప్పుడే బాగా అర్థం అవుతున్నట్టుగా ఉంది. అందులోనూ ప్రత్యర్థి ధీటుగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ విజయం నల్లేరు మీద నడకైతే కాదు. అమీతుమీ తలపడితే.. చావో రేవో అన్నట్టుగా తలపడితే.. కానీ విజయం దక్కుతుందో, ఓటమే తప్పదో తేలదు.
మరి రాప్తాడులోనే ఢీ కొట్టడం తేలిక కాని నేపథ్యంలో.. పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో హల్చల్ చేయడం ఆసక్తిదాయకంగా మారింది. ధర్మవరంలో కూడా వీరికి కొత్త ప్రత్యర్థి తేలికైన వాడేమీ కాదు. ధర్మవరం రాజకీయంలో తలపండిపోయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఢీ కొట్టడానికి పరిటాల శ్రీరామ్ బాగా ఉబలాటపడుతూ ఉన్నాడు. వెంకట్రామిరెడ్డి 2005 నుంచి ధర్మవరం రాజకీయంలోనే ఉన్నాడు. రెండోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. కేతిరెడ్డి రాజకీయంలో వ్యాపారస్తులను బెదిరించడం, దౌర్జన్యాలు, వారినీ వీరినీ బెదరగొట్టడాలు లేవు. 90లలో పరిటాల రవి ధర్మవరం ఏరియాలో చేసిన రాజకీయానికి పూర్తి భిన్నంగా ఉంది గత దశాబ్దంన్నర పరిస్థితి.
ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మవరం ఏరియా పరిటాల వాళ్లను మరిచిపోయింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్లీ ఇక్కడ హల్చల్ చేయడానికి రవి తనయుడు ఆరాటపడుతూ ఉండటం ప్రహసనం. అందులోనూ రాప్తాడులో తొలి ఎన్నికల్లోనే చిత్తపోయిన శ్రీరామ్ అక్కడ సత్తా చూపించాల్సింది పోయి, ఇక్కడ ఆరాటం చూపుతున్నారు. రాప్తాడు గ్రామీణంతో పోలిస్తే.. ధర్మవరం రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత స్ట్రాంగ్ కూడా! ఇదంతా విశ్లేషిస్తే.. పరిటాల శ్రీరామ్ తన అపరిపక్వతతో, ధర్మవరం వైపు అనవసరంగా ఆరాటం చూపిస్తున్నారని అనే విశ్లేషణ సహజంగానే వినిపిస్తోంది.