బీసీ జనార్ధన్ రెడ్డి.. ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయానికి ఆయనే పెద్ద దిక్కుగా చలామణి అవుతున్నట్టుగా ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీకి బీసీ ప్రధాన నేతగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన జనార్ధన్ రెడ్డి, 2019 కళ్లా ఓటమి పాలయ్యారు! 2014 ఎన్నికల ముందు కూడా ఈయనకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన చరిత్ర లేదు. కేవలం ఒక టర్మ్ ఎమ్మెల్యే, అది కూడా ఒక సారి గెలిచి, రెండోసారి ఓడిన నేతకు తెలుగుదేశం కర్నూలు విభాగంపై ఇంత పట్టు చిక్కుతూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది.
ప్రత్యేకించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనార్ధన్ రెడ్డికి బాగా ప్రాధాన్యతను ఇస్తున్నారనే టాక్ నడుస్తూ ఉంది. ఈయన చెప్పిన వారికే కర్నూలు జిల్లా పరిధిలో, అటు నంద్యాల వైపు కూడా చంద్రబాబు ప్రాధాన్యతను ఇస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి డబ్బు ఉన్న వారిని పార్టీ వైపు తీసుకురావడంలో జనార్ధన్ రెడ్డి బాగా శ్రద్ధ చూపుతున్నారని, చంద్రబాబుకు ఇది బాగా నచ్చుతోందనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి.
పూర్వ కర్నూలు జిల్లా పరిధిలో తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా కేఈ కుటుంబం, భూమా కుటుంబం హవా చలాయించింది. భూమా కుటుంబం 2009 నుంచి 2016ల వరకూ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యింది.ఆ తర్వాత మళ్లీ టీడీపీ వైపు వచ్చి అందరినీ అదరగొట్టి, బెదరగొట్టే స్థితిలో భూమా కుటుంబం వ్యవహరించింది. మరోవైపు కేఈ కుటుంబం తమ ప్రాధాన్యతను నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ కేఈ కుటుంబానికి చంద్రబాబు చాలా వరకూ ప్రాధాన్యతను తగ్గించి వేశారు. అలాగే భూమా అఖిలప్రియ ఇప్పుడు చంద్రబాబు వద్ద పరపతిని పూర్తిగా కోల్పోయినట్టుగా ఉన్నారు.
ఇక కాంగ్రెస్ పతానానంతరం తెలుగుదేశం పార్టీలో చేరి కోట్ల కుటుంబం కూడా ఇక్కడ తమ హవాను చలాయించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు కూడా అంత సానుకూలంగా ఉన్నట్టుగా లేవు! మరి కేఈ, కోట్ల, భూమా కుటుంబాల కన్నా.. ఇప్పుడు ఇప్పుడు బీసీ జనార్ధన్ రెడ్డి మాటే చెల్లుబాటు అయ్యేంతలా పరిణామాలు మారిపోవడం గమనార్హం.
చంద్రబాబుకు ఇలాంటి రాజకీయం కొత్త కాదు అని, తన మాటకు జవదాటని వారు, ఆర్థికంగా బలంగా ఉన్న వారికే చంద్రబాబు ప్రాధాన్యతను ఇస్తారని, ఈ క్రమంలోనే బీసీ జనార్ధన్ రెడ్డి హవా ఇప్పుడు టీడీపీలో సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే బీసీ జనార్ధన్ రెడ్డి పై ఇప్పుడు కేఈ, భూమా, కోట్ల కుటుంబాలు కుతకుతలాడిపోతున్నాయని మాత్రం ఎరిగిన వారు అంటున్నారు. తమను కాదనే రీతిలో జనార్ధన్ రెడ్డికి చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని వారు సహించలేకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు!