సాధారణంగా విజయం కోసం చివరి వరకూ పోరాడుతుంటారు. అలాంటి వారిని పోరాడి ఓడారని సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. మరోసారి అవకాశం వస్తే… అతనే గెలవాలని కోరుకుంటుంటారు. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం ఓటమిని కోరి తెచ్చుకుంటారు. పవన్ ఓటమి ఆయన స్వీయ తప్పిదమే తప్ప, ముఖ్యమంత్రి వైఎస్ జగనో, మరొకరో కారణం ఎంత మాత్రం కాదు.
హైదరాబాద్‌లో ” ఫేసింగ్ ది ప్యూచర్” అనే అంశంపై పవన్ ప్రసంగిస్తూ తన ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తాను ఫెయిల్డ్ రాజకీయ నాయకుడిగా చెప్పుకొచ్చారు. తన ఓటముల గురించి నిర్భయంగా మాట్లాడుతా అన్నారు. పరాజయంలోనే జయం వుంటుందన్నారు. ఇవాళ్టి ఓటమే.. రేపటి విజయానికి పునాది అని పవన్ అన్నారు. ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దని ఆయన సూచించారు. ఇందుకు దేవుడు కూడా మినహాయింపు కాదని ఆయన చెప్పడం విశేషం.
గెలుపోటములపై స్పష్టమైన అవగాహన పవన్‌కు ఉందని ఆయన మాటల ద్వారా తెలుసుకోవచ్చు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌కల్యాణ్… ఇంత వరకూ కనీసం పార్టీ అధినేతగా అసెంబ్లీలో అడుగు పెట్టలేని దుస్థితికి కారణం ఎవరు? ఇందుకు సమాధానం పవన్‌కల్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ పంథానే కారణమని ఎవరైనా చెబుతారు.
ఎంత సేపూ ఇతర పార్టీల నాయకుల్ని ఓడించడం లేదా గెలిపించడంపైనే పవన్ దృష్టి వుంటోంది. తాను గెలవాలనే తపన, పట్టుదల ఇంత వరకూ ఆయనలో లేవు. నిజంగా అధికారంలోకి రావాలనే ఆకాంక్ష బలీయంగా వుంటే పవన్ చేయాల్సిన రాజకీయం ఇది మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. 2014లో పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో… జగన్‌ను ఓడించడానికే టీడీపీ -బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చానన్నారు.
2019లో కూడా ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో సీఎం కానివ్వనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. పవన్ దురద్దేశాన్ని పసిగట్టిన జనం… చివరికి ఆయన్ను కూడా రెండు చోట్ల ఓడించి గుణపాఠం చెప్పారు. తనను రెండు చోట్ల ఓడించినా ఆయన పాఠాలు నేర్చుకోలేదు. వ్యక్తిగతంగా తాను గెలవడంతో పాటు పార్టీని కూడా విజయ పథాన నడిపించాలనే ధ్యాస, పట్టుదల ఆయనలో ఇప్పటికీ కనిపించకపోవడం జనసేన పరాజయానికి కారణమవుతోంది.
ఓటమిపై విజయానికి పునాది వేసుకోవాలని ఎదుటి వాళ్లకు చెప్పడమే తప్ప ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. పవన్ గ్రహించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే… రాజకీయాల్లో తన గెలుపు జీవితాన్ని సందేశంగా చెప్పుకునే రోజు కోసం పని చేయడం. మరి మంచి పనికి ఆయన శ్రీకారం ఎప్పుడు చుడుతారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.