ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది కి కాస్త ఎక్కువ సమయం ఉంది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికల వేడి తీవ్ర స్థాయికి వెళుతుంది. నాలుగైదు నెలల పాటు పతాక స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీల అధినేత స్థాయిలో ఎన్నికల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, కసరత్తులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇన్నాళ్లూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్లకు ఇదే అదునుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడి వారూ ఇప్పుడు లేచొస్తున్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేస్తాం.. అనే ప్రకటనలు, ప్రగల్బాలు నేతలు పలికేస్తున్నారు.
మూడున్నరేళ్లుగా రాజకీయాలతో తమకు సంబంధం లేనట్టుగా గడిపిన వారు ఇప్పుడిప్పుడు హడావుడి చేస్తూ ఉండటం కొంత ఆసక్తిదాయకంగా, మరికొంత ప్రసహనంగా ఉంది. ఎన్నికలకు సమయం దగ్గరపడితే కానీ.. రాజకీయం గుర్తుకు రాలేదన్నట్టుగా ఉంది ఈ నేతల పరిస్థితి. అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ.. అనే ప్రకటన చేస్తున్న వారు సిట్టింగులు అయితే కాదు! సిట్టింగుల్లో చాలా మందికి టికెట్ల పట్ల విశ్వాసం ఉంది. అయితే గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు, పార్టీలు పవర్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా వ్యవహరించి, ప్రస్తుతం మాజీలుగా ఉన్న వారు, అవకాశం దక్కినప్పుడు ఓటమి పాలై.. ఆ తర్వాత రాజకీయంగా తెరమరుగు అయిన వారు.. ఇలాంటి వాళ్లు ఇప్పుడు హడావుడి మొదలుపెడుతున్నారు.
ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ తేడా లేకుండా ఇలాంటి హడావుడి మొదలవుతోందిప్పుడు. తమ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట కూడా .. ఇలాంటి ద్వితీయ శ్రేణి నేతలు, గతంలో పోటీ చేసి ఓడిన వారు ఇప్పుడు రాజకీయ వార్తల్లో చోటు సంపాదించేందుకు ఆరాటపడుతూ ఉన్నారు. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు జరగనున్నాయి. ఇదే తాము లేచి నిలబడటానికి తగిన సందర్భం అని ఈ నేతలు భావిస్తున్నారు.
మరి ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యేంత వరకూ రాజకీయం గుర్తుకు రాని, ఖర్చులకు జడిసి రాజకీయాలకు దూరదూరంగా నడుచుకున్న వారికి ఇప్పుడిప్పుడు ఆరాటం మొదలుకావడాన్ని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్నికలకు సమయం ఆసన్నం అయితే కానీ.. వీరిలో కొందరికి తాము రాజకీయ నేతలం అని గుర్తుకు వచ్చినట్టుగా లేదు! రాజకీయం అంటే ఏ స్థాయిలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో చెప్పనక్కర్లేదు. అందులోనూ గతంలో పోటీ చేసి, ఖర్చులు పెట్టుకుని, ఆస్తిపాస్తులు కోల్పోయిన వారికి టికెట్ విషయంలో ఎలాంటి హామీ లేకుండా గ్రూపును మెయింటెయిన్ చేస్తూ ఖర్చులు భరించడం అంటే మాటలేమీ కాదు.
అందుకే సరిగ్గా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పుడు ఇలాంటి వాళ్లంతా కదులుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీకి సై .. అనే వారిలో ఎంతమందిని వారి వారి అధిష్టానాలు సీరియస్ గా తీసుకుంటాయో!