అల్లూరి సీతారామరాజు విశాఖ మన్నెంలో పోరాటం చేశారు. ఆయన విశాఖ ఏజెన్సీలో విల్లూ బాణం పట్టి తెల్ల దొరలతో వీరోచితమైన పోరు సాగించారు. ఆయనకు ఈ పోరాటంలో సహచరించిన వారిలో అతి ముఖ్యులు గంటం దొర, బోడి దొర. వీరు ఆయనకు కుడి భుజంగా ఉండేవారు.
అల్లూరి తెల్ల దొరలకు ఎదురు నిలిచి సాగించిన పోరులో వీర మరణం పొందారు. ఆ తరువాత గంటం దొర బోడి దొరల గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. ఇందులో బోడి దొర కుటుంబంలో ఎవరూ కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా బాగుపడలేదు. రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందలేదు. పైగా అతి సామాన్యంగా ఉంటూ దుర్బర జీవితాన్ని అనుభవించారు.
ఆ కుటుంబంలో విద్యావంతులు కూడా లేరు. ఇపుడు బోడి దొర మనవరాలు డిగ్రీ దాకా చదివి ఉద్యోగం సంపాదించింది అంటే ఆశ్చర్యమే కాదు ఒకింత బాధ కూడా. ఏ పోరాటం దేశం కోసం చేయకుండా పదవులు అనుభవించిన వారు దేశంలో ఉన్నారు. కానీ నిజంగా తెల్లదొరలకు ఎదురొడ్డి నిలిచిన అసలైన దేశ భక్తులు అయిన ఈ గిరిజన నాయకుల గురించి ఎవరికీ పట్టలేదన్నదే బాధ.
బోడి దొర మనవరాలు కెజియాకు విఎస్ఈజెడ్ లో క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ని ఆ సంస్థ సీఈవో అందచేశారు. ఈ ఉద్యోగంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. అలాగే అమరులైన అల్లూరి సహచరులకు ఇది ఒక నివాళిగా ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు గిరిజనంలో ఇంకా ఎంతో మందికి కూడా కేజీయా స్పూర్తిగా మారారని అంటున్నారు.