ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానని జగన్మోహన రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు ప్రజల్లో చాలామంది నమ్మలేదు. ఇలాంటి పడికట్టు హామీలు ఇస్తూనే ఉంటార్లే.. పాలనలోకి వస్తే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది అని అనుకున్నారు. కానీ… పాలనలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహనరెడ్డి మద్యనిషేధం దిశగా తన తొలిప్రయత్నం ద్వారా మాత్రమేకాదు. మలిప్రయత్నం ద్వారా కూడా… మద్య నిషేధం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. మద్యనిషేధం జరుగుతుందనే ఆశలను ఇంకాస్త పెంచుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. 10 నుంచి 250 రూపాయల వరకు వివిధ లిక్కర్ ధరలు పెరిగాయి. ధరలపెంపు అనేది వినియోగం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఆశింవచ్చు. అలాగే.. మద్య విక్రయవేళలను కూడా కుదించారు. ఇది కూడా వినియోగం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ నిషేధం దిశగా మలిఅడుగులుగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ సారథ్యంలో తొలి అడుగుగా మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించడానికి పూనుకుంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయాలు ప్రారంభించినప్పుడే 20శాతం దుకాణాల సంఖ్యను తగ్గించారు. అదే తొలి అడుగు. విక్రయవేళలను ఇప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 8వరకే పరిమితం చేశారు. దాంతోపాటు ధరలు పెంచారు. ఇవి మలి అడుగులు. మొత్తానికి జగన్ సర్కారు నిషేధం దిశగా చిత్తశుద్ధితో కదులుతున్నట్లుగా ప్రస్తుతానికి కనిపిస్తోంది.
మద్యనిషేధం అనే హామీ జగన్ ఇచ్చినప్పుడు.. మద్యం మాత్రమే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు అని భావించే ప్రజలు దానిని నమ్మలేదు. అంత పెద్ద ఆదాయమార్గాన్ని ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుంది అని అనుకున్నారు. అసలే నిధుల, ఆర్థిక వనరుల ఆసరా పెద్దగా లేని రాష్ట్రంగా మద్యాన్ని కూడా ఎలా వదులుకోగలరు అని అనుకున్నారు.
కానీ జగన్ చిత్తశుద్ధితో నిషేధం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్… ఇందులో లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సంకల్పం వక్రమార్గం పట్టిపోకుండా అధికార్లలో కూడా స్ఫూర్తిని నింపాలి.