సైరాకు ‘అదనపు’ దెబ్బ

భారీ సినిమాలకు, టాప్ హీరోలకు అదనపు ఆదాయ వనరు బెనిఫిట్ షోలు లేదా అదనపు షోలు. కానీ సైరా లాంటి మెగా మూవీకి ఇప్పటి వరకు అదనపు ఆటల అనుమతి రాలేదు. మంగళవారం ఒంటిగంట…

భారీ సినిమాలకు, టాప్ హీరోలకు అదనపు ఆదాయ వనరు బెనిఫిట్ షోలు లేదా అదనపు షోలు. కానీ సైరా లాంటి మెగా మూవీకి ఇప్పటి వరకు అదనపు ఆటల అనుమతి రాలేదు. మంగళవారం ఒంటిగంట లోపు వచ్చే అవకాశం కచ్చితంగా కనిపించడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు తెరుచుకునేది 10 తరువాత, ఐఎఎస్ అధికారులు వచ్చేది 11 తరువాత, అప్పుడు డిస్కషన్లు సాగిస్తే, అనుమతి రావాలంటే ఎంత లేదన్నా 12 దాటుతుంది. అప్పుడు అనుమతి వచ్చినా, థియేటర్లు సిస్టమ్ లో టైమ్ లు మార్చి, అడ్జస్ట్ చేసి, టికెట్ లు తీయడానికి ఎలా లేదన్నా మరో రెండు గంటలు పడుతుంది.

అంటే అనుమతి వస్తే, కనీసం మూడు గంటల తరువాత కానీ టికెట్ లు రావడం కష్టం. దీనివల్ల ఫ్యాన్స్ ఎర్లీ మార్నింగ్ షో లు ప్లాన్ చేయడం చాలాకష్టం. వాస్తవానికి ఫ్యాన్స్ అందరూ చాలాచోట్ల మూడురోజుల కిందటే అలవాటు ప్రకారం బెనిఫిట్ షోలకు డబ్బులు కట్టేసారు. కానీ ఈ పరిస్థితి చూసి కొన్నిచోట్ల బయ్యర్లు ఫ్యాన్స్ డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేసారు.

ఇదిలావుంటే స్పెషల్ షోలు అంటే నాలుగు నుంచి అయిదు వందల రేటు వస్తుంది టికెట్ కు. దానివల్ల బయ్యర్లకు మాంచి ఆదాయం వస్తుంది. భారీ రేట్లకు కొనడం వల్ల ఈ బెనిఫిట్ షోల వల్ల లాభం పొందుతారు. ఇలా అనుమతి రాకపోవడంతో కనీసం 10శాతం ఆదాయం తగ్గిపోతుంది.

''ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. సాధారణంగా రెండు రోజుల ముందు అనుమతి వస్తుంది. ఫ్యాన్స్ గ్రూపులకు అప్పుడే టికెట్ లు ఇచ్చేస్తాం. వాళ్లు పంచుకుంటారు. బయ్యర్ కు ఆదాయం క్లియర్ అవుతుంది. ఇప్పుడు డబ్బులు వెనక్కు ఇచ్చేయాల్సి వచ్చింది. అదనపు ఆటలు వుంటాయనే భారీ రేట్లకు కొన్నారు. ఇప్పుడు పదిశాతం ఆదాయం తగ్గేలా కనిపిస్తోంది… ఇప్పుడు అయిదువందలకు అమ్మే టికెట్ లను నార్మల్ రేట్లకు కౌంటర్ లో అమ్మేసుకోవాలి… ఇది ఒక్కటే సమస్య కాదు, అదనపు ఆటలు వుంటాయో? వుండవా? అన్నది తెలియకపోవడం వల్ల, షోలు ప్లాన్ చేసుకోవడం, ఆన్ లైన్ ఓపెన్ చేయడం కూడా సమస్యగా కనిపిస్తోంది..'' అని అన్నారు ఓ కోస్తా బయ్యర్.

'కన్నబాబు ప్రయత్నం?'
అదనపు ఆటల ప్రయత్నం జరుగుతోందా? లేదా? అన్న విషయమై యూనిట్ వైపు నుంచి కూడా సరైన క్లారిటీలేదు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇందులో ఒక గ్యాసిప్ ఏమిటంటే, చిరంజీవి తనకు సన్నిహితుడైన మంత్రి కన్నబాబు ద్వారా ప్రయత్నిస్తున్నారన్నది. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. ఎందుకంటే మరో నిర్మాత, మరో నిర్మాత అయితే వేరు. జనసేనాధిపతి పవన్ ఫ్యామిలీకి చెందిన నిర్మాత కావడం, సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ సిఎమ్ జగన్ దగ్గర వుండడం వల్ల ఎవ్వరూ జోక్యం చేసుకుంటారు? అన్నది పాయింట్.

మరోపక్కన నిర్మాత, బయ్యర్ దిల్ రాజు తన సర్కిల్ లో ట్రయ్ చేస్తున్నారని వినిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు అదనపు ఆటల ఆదేశాలు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే నిన్నంతా రకరకాల ట్వీట్ లతో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేస్తూనే వున్నారు. మరి ఇవన్నీ చూసాక కూడా జగన్ అదనపు ఆటల అనుమతి ఇస్తారా? అన్న క్వశ్చన్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మొత్తంమీద అదనపు ఆటలు రాకపోతే మాత్రం సైరా బయ్యర్లకు కాస్త కష్టం తప్పదని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!