తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌లో ఇది ట్రైలర్ మాత్రమే అని, మున్ముందు సినిమా వేరే వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జైలుకు పోవడానికి కూడా సిద్ధమే అని కవిత బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం దాన్ని లైట్ తీసుకున్నాయి. కేవలం వివరణ కోసమే అంటూ తెలంగాణ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చే నోటీసులు సమన్ల కిందికి రావని టీఆర్ఎస్ వర్గాల వాదన. కేసులో సందేహా లుంటే వివరణ తీసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారని వారు చెబుతున్నారు. ఈ నెల 6న కవిత వివరణను ఆమె ఇంటికే వెళ్లి సీబీఐ అధికారులు తీసుకోనున్నారు.
టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టు …సీబీఐ నోటీసును కేవలం వివరణ కోసమే అనే కోణంలో చూడొద్దని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, ఇప్పటికీ కేసీఆర్, ఆయన పార్టీ బీజేపీకి తలొగ్గకపోతే మాత్రం సినిమా చూపుతారనే హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌ను బలహీనపరచాలని అనుకుంటే ఆయన కంటే, కూతురైన కవితను జైల్లో వేయడమే ఉత్తమమని బీజేపీ పెద్దలు తప్పక ఆలోచిస్తారనే ప్రచారం జరుగుతోంది.
సహజంగానే తండ్రికి కూతురంటే ఇష్టం వుంటుంది. ముద్దుల తనయ అయిన కవితను ఇబ్బందులకు గురి చేస్తే కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు తప్పక కుంగిపోతారని బీజేపీ ఆలోచించే అవకాశం ఉంది. బీజేపీ నైజం తెలిసిన వారెవరైనా… ఆ పార్టీ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు ఎంత వరకైనా వెళుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం వివరణ కోసమనేది ఓ చిన్న హెచ్చరిక అని, అప్పటికీ దారి రాకపోతే కేంద్రం తన విశ్వరూపం చూపుతుందనే ప్రచారాన్ని కొట్టి పారేయలేం.