వినే వాళ్లుంటే చంద్రబాబు ఎన్ని కోతలైనా కోస్తారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ఏదీ దాచి పెట్టడానికి లేకుండా పోయింది. ఏ పాలకుడు ఏం చేశాడో క్షణకాలంలో తెలుసుకునే అవకాశాలు చేరువయ్యాయి. దీంతో ఏదో ఒకటి చెబితే జనం నమ్ముతారని అనుకుంటే తప్పులో కాలేసినట్టు. జనాన్ని నాయకులు మభ్యపెట్టే విధానాలకు కాలం చెల్లింది.
ఈ నేపథ్యంలో తన పాలనలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించానంటూ చంద్రబాబు గొప్పలు చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులైతే 30 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడ కల్పించారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పాత సెటైర్‌ను వైసీపీ సోషల్ మీడియా తెరపైకి తెచ్చి భారీగా ట్రోల్ చేస్తోంది. ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు ఏమన్నారంటే…
‘ఐదేళ్లలో రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి 30 లక్షల ఉద్యోగాలిచ్చాను. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కడుపు మండిపోతోంది’ అని చంద్రబాబు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే రీతిలో ఆయన ప్రచారం చేసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించే పేరుతో విదేశాలకు వెళ్లేవారు. అలాగే విశాఖలో బిజినెస్ సమ్మిట్ పేరుతో లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రచారం చేయడం తెలిసిందే.
బాబు హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు గతంలో టీడీపీ అనుకూల మీడియా ఊదరగొట్టింది. అయితే లోకేశ్‌కు తప్ప, ఏ నిరుద్యోగికి చంద్రబాబు ఉద్యోగం ఇవ్వలేదని సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేశారు. ఇదే సందర్భంలో ఎల్లో మీడియాపై కూడా సెటైర్స్ వెల్లువెత్తాయి. ఈ 30 లక్షల మంది ఉద్యోగులు ఎల్లో మీడియా, అలాగే టీడీపీ కార్యాలయాలకు వెళ్లి జీతాలు తీసుకోవాలని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
చంద్రబాబు ప్రభుత్వం, ఎల్లో మీడియాపై ఈ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి చంద్రబాబు తన హయాం నాటి ఉద్యోగాల కల్పనపై అవే అబద్ధాలు పునరావృతం చేయడంతో నెటిజన్లు పాత పోస్టులు బయటికి తీయడం విశేషం.