ఏ మాత్రం ప్రచార ఆర్భాటం లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి చకచకా అడుగులు ముందుకేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలీస్ ఉద్యోగాలు, తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం విశేషం. న్యాయశాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. దీంతో ఏపీ నిరుద్యోగ యువతలో ఆనందానికి అవధుల్లేవు.
జగన్ ప్రభుత్వం బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయడం లేదంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే జగన్ సర్కార్ వచ్చీరాగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షకు పైబడి పర్మినెంట్ ఉద్యోగాల భర్తీని ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగానే విస్మరించాయి. ఇవాళ రాజకీయ నాయకుల సిఫార్సులు, మధ్యవర్తుల అవసరం లేకుండానే నేరుగా సచివాలయాల వద్దకెళ్లి పనులు చక్కదిద్దుకుంటున్నారు. ఇంతకంటే జనానికి ఏం కావాలి?
సచివాలయ వ్యవస్థ ద్వారా పెద్ద మార్పునే చూస్తున్నాం. వైసీపీ అధికారంలో వున్నా, లేకపోయినా, జగన్ మార్క్ పాలనకు ఇది నిదర్శనంగా చిరస్థాయిగా నిలబడుతుంది. ఇదిలా వుండగా ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ ప్రభుత్వం ఏ మాత్రం ప్రచారం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది.
ఇదే తెలంగాణలో గమనిస్తే… అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేపడతామంటూ అట్టహాసంగా ప్రకటించారు. కానీ ఉద్యోగాల భర్తీ మాత్రం ఆయన ప్రచారం చేసుకున్నంత రేంజ్లో లేదు. జగన్ విషయానికి వస్తే… ఎప్పట్లా తన పని తాను చేసుకుంటూ, మరోవైపు తెల్లారేసరికి నోటిఫికేషన్లు ఇవ్వడం గమ్మత్తుగా వుంది. ఒక్కో డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తుండడంతో, ఇతర శాఖలకు సంబంధించి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.